పర్వతాల్లో పోలింగ్ కేంద్రాలు... వారం ముందే బయలుదేరిన పోలింగ్ సిబ్బంది

Arunachal Pradesh Assembly Elections 2019 : ఆ పోలింగ్ కేంద్రాల్ని చేరాలంటే వారం పడుతుంది. ఆ పరిస్థితి ఎందుకొస్తుందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: April 7, 2019, 7:38 AM IST
పర్వతాల్లో పోలింగ్ కేంద్రాలు... వారం ముందే బయలుదేరిన పోలింగ్ సిబ్బంది
అరుణాచల్ ప్రదేశ్ (File)
  • Share this:
మన తెలుగు రాష్ట్రాల్లో లాగానే... ఏప్రిల్ 11న భారత్-చైనా సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని సజావుగా జరిపించేందుకు 4 పోలింగ్ కేంద్రాల సిబ్బంది వారం ముందుగానే బయలుదేరారు. ఎప్పుడో 11న ఎన్నికలైతే... వాళ్లంతా 6నే బయలుదేరారు. దేశంలో మరెక్కడా ఇలా జరగట్లేదు. శనివారం ఆ సిబ్బంది 8 గంటల పాటూ హెలికాప్టర్‌లో ప్రయాణించి, పోలింగ్ కేంద్రాలకు 163 కిలోమీటర్ల దగ్గర దాకా వెళ్లారు. ఇక అక్కడి నుంచీ ఓ బృందం... 6 రోజులపాటూ నడిచి, మయన్మార్ సరిహద్దులోని మియావో అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని చేరుకుంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ తూర్పు లోక్ సభ నియోజకవర్గంలో ఉంది. ఒక్కో బృందంలో ఇద్దరు పోలీసులు, ఐదుగురు ఎన్నికల సిబ్బంది, ఓ సహాయకుడు ఉంటారు.

మిగతా 3 బృందాలు పదో తేదీ వరకూ విజయనగర్‌లో ఉండి అక్కడి నుంచీ పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. మరికొన్ని బృందాలు 9న... 8 గంటలపాటూ నడిచి పోలింగ్ కేంద్రాల్ని చేరుకుంటాయి. ప్రస్తుతం అక్కడి వాతావరణం ఏమాత్రం సానుకూలంగా లేదు. హెలికాప్టర్లు తిరిగేందుకు వీలుగా లేదు. అందువల్లే నడక మార్గంలో వెళ్లాల్సి వస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఒక్క మహిళ కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగాం గ్రామం చైనా సరిహద్దు వెంట ఉంది. అక్కడ సొకేలా టయాంగ్ అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. అక్కడి వరకూ వెళ్లాలంటే రవాణా మార్గం లేదు. కొండలు, సెలయేళ్లు, లోయలూ దాటుకుని నడుచుకుంటూ వెళ్లాలి. అందుకోసం ఓ రోజంతా టైమ్ పడుతుంది. అయినప్పటికీ ఆమె కోసం ఆమె ఊరిలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు.


సొకేలా ఉండే ఊరు... హేయులింగ్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది. అక్కడ చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లలో 39 ఏళ్ల సొకేలా మాత్రమే అక్కడి ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేయించుకుంది. మిగిలిన వాళ్లంతా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. సొకేలా భర్త జెనేలాం తయాంగ్.... వేరే బూత్‌లో పేరు నమోదు చేయించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆమె కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం వచ్చింది.

ఇలా మనం వేసే ఓటు కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికీ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో శ్రమిస్తోంది. అందుకే మనం తప్పనిసరిగా ఓటు వెయ్యాలి. వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి.

 

ఇవి కూడా చదవండి :మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు

చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత
First published: April 7, 2019, 7:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading