కేరళలో భారీ వర్షాలు, వరదలూ ఏ రేంజ్‌లో ఉంటున్నాయో చూస్తున్నాం. కేరళకే చెందిన బట్టల వ్యాపారి నౌషద్... వరద బాధితుల్ని చూసి కన్నీరు పెట్టాడు. అతని గుండె కరిగిపోయింది. త్యాగ నిరతికి ప్రతీక అయిన... ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా... తన దగ్గరున్న బట్టలన్నింటినీ వరద బాధితులకు ఉచితంగా ఇచ్చేశాడు. నిజానికి అతను ఆ బట్టల్ని ఎర్నాకుళంలోని మట్టంచెరి మార్కెట్‌లో బక్రీద్ సమయంలో అమ్మాలని ముందుగా అనుకున్నాడు. తీరా పరిస్థితులు మారిపోవడంతో... చలించిపోయి... దానం చేశాడు. నటుడు రాజేష్ శర్మ నేతృత్వంలోని కొందరు సభ్యుల బృందం వరద బాధితుల కోసం వస్తువులు సేకరిస్తుంటే... వారికి తన దగ్గరున్న కొత్త బట్టలన్నింటినీ ఇచ్చేశాడు నౌషద్.
కేరళలోని భారీ వర్షాల వల్ల మలబార్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. వరదలకు తోడు... కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఈ సమయంలో... వస్తువుల సేకరణ జరుగుతున్న విషయం తెలుసుకున్న నౌషద్... తన షాపుకి రమ్మని వాళ్లను పిలిచాడు. నౌషద్ ఎక్కువగా పిల్లలు, మహిళలకు సంబంధించిన బట్టలు అమ్ముతుంటాడు. కొత్త బట్టల్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఐదు బ్యాగుల నిండా పట్టిన బట్టలన్నింటినీ ఇచ్చేశాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై రాజేష్... ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ నౌషద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బక్రీద్‌ని తాను ఇలా చేసుకుంటున్నానని నౌషద్ చెప్పడం ఎంతో మంది హృదయాల్ని కదిలించింది.
ఫేస్‌బుక్ వీడియోను చూసిన కేరల ప్రజా పంపిణీ శాఖ మంత్రి సుధాకరణ్... అతన్ని మెచ్చుకున్నారు. సమాజానికి నౌషద్ పాజిటివ్ మెసేజ్ పంపారని కీర్తించారు. మలయాళ ఫిల్మ్ స్టార్ అసిఫ్ అలీ కూడా నౌషద్ లా సాయం చేసే వాళ్లు ఉన్నంతకాలం... ఈ ప్రపంచం సంతోషంగానే ఉంటుందని కామెంట్ చేశాడు. ఎర్నాకుళం జిల్లా కలెక్టర్... నౌషద్‌కి కాల్ చేసి మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తైన తర్వాత తనే స్వయంగా వెళ్లి ఆయన్ని కలుస్తానన్నారు.
కేరళలో భారీ వర్షాల వల్ల 2.27 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంతా 1551 రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకున్నారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్... వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటికే ఈ వరదల వల్ల చనిపోయిన మృతుల సంఖ్య 80 దాటింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala floods, Kerala rains, National News