రెండేళ్ల వారంటీతో ఫర్నీచర్ (Furniture) ఐటెమ్స్ అమ్ముతున్న ఒక వస్త్ర, ఫర్నిషింగ్ కంపెనీకి ఓ కస్టమర్ భారీ షాక్ ఇచ్చారు. ఈ కంపెనీ తనకు విక్రయించిన రెండు చెక్క కుర్చీలలో (Wooden Chair) ఒక కుర్చీకి చెదలు పట్టిందని, దానికి బదులు కొత్తది ఇవ్వలేదంటూ ఆ కస్టమర్ కన్స్యూమర్ కోర్టులో (Consumer Court) ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కన్స్యూమర్ కోర్టు తీర్పు వెలువరిస్తూ.. కస్టమర్‌కు రూ.15,000 నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, రెండు కుర్చీల కొనుగోలుకు అయిన మొత్తం డబ్బును వాపసు ఇవ్వాలని.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. మార్చి 31, 2019న బెంగళూరు (Bengaluru)లోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు చెందిన విశాఖ వైద్య (44) ఫ్యాబిండియా (Fabindia) కంపెనీ నుంచి రెండు చెక్క కుర్చీలు కొనుగోలు చేశారు. కొన్ని నెలల తర్వాత ఆ కుర్చీలపై చాలా దుమ్ము పేరుకుపోవడం గమనించారు. వాటిని శుభ్రం చేస్తుండగా ఒక కుర్చీ బాగా పాడైనట్లు తెలుసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 24, 2020న ఈ-మెయిల్ ద్వారా ఫాబిండియాని సంప్రదించి సమస్యను తెలియజేశారు. ఈ ప్రొడక్ట్ 24-నెలల వారంటీ కింద ఉన్నందున, కంపెనీ క్వాలిటీ-కంట్రోల్ టీమ్‌ను పంపింది. వారికి ఆ కుర్చీలో తెగులు సోకినట్లు తెలిసింది. ఈ తెగులు పురుగు తన ఇంటి డోర్‌కు కూడా సోకిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు కుర్చీలను రిటన్ తీసుకొని అదే మోడల్ గల కొత్త కుర్చీలను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయగా.. కంపెనీ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆమె శాంతినగర్‌లోని బెంగుళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఆపై ఫ్యాబిండియా ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఫిర్యాదు చేశారు.
వైద్య తరఫు న్యాయవాది ఆమె వాదనను వినిపించారు. అయితే ఫాబిండియా తరఫు న్యాయవాది ఈ ఫిర్యాదును ఒక అన్యాయమైన ఫిర్యాదుగా అభివర్ణించారు. ఆ న్యాయవాది ప్రకారం, ఈ రెండు కుర్చీలను వైద్యకు నచ్చిన వస్తువులతో లేదా సమానమైన విలువ, గిఫ్ట్ వోచర్లతో రీప్లేస్ చేస్తామని కంపెనీ ఆఫర్ చేసింది. కానీ ఆమె రెండు కుర్చీలను అదే మోడల్‌తో రీప్లేస్ చేయాలని మొండికేశారట. ఆ మోడల్ లేకపోతే రెండు కుర్చీలు, ఒక డైనింగ్ టేబుల్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇది అసలు వారంటీ నిబంధన కిందకే రానిదని ఫాబిండియా తరఫు న్యాయవాది వాదించారు.
జులై 2, 2022న వినియోగదారుల ఫోరంలోని న్యాయమూర్తులు ఒక కుర్చీకి చెదలు పట్టడం నిజమేనని పేర్కొన్నారు. కానీ ఫిర్యాదుదారు చెప్పినట్లు ఆమె తలుపుకు చెక్క పురుగు సోకిందని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించారు. ఫిర్యాదుదారు కంపెనీకి రెండు కుర్చీల కోసం రూ.24,485 చెల్లించారని, ఇప్పుడు రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారని.. ఇది సబబు కాదని కోర్టు జడ్జీలు అభిప్రాయపడ్డారు. అయితే, వారంటీ షరతుల ప్రకారం, ఫిర్యాదుదారుడు అదే విలువ ఉన్న అదే మోడల్ కుర్చీలను లేదా గిఫ్ట్ వోచర్‌తో ప్రొడక్ట్‌ను పొందడానికి అర్హులు అని స్పష్టం చేశారు. అదే మోడల్ అందుబాటులో లేనందున, ఫిర్యాదుదారుకి వాపసు ఇవ్వాలని కంపెనీని ఆదేశించారు. కుర్చీల ధర రూ.24,485తో పాటు రూ.10,000 నష్టపరిహారం, ఫిర్యాదుదారు కోర్టు ఖర్చుల కోసం రూ.5,000 కంపెనీ తప్పనిసరిగా చెల్లించాలని తీర్పు వెలువరించారు. 45 రోజుల్లో కస్టమర్ నుంచి కుర్చీలను వాపసు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Courts, Gifts, Supreme Court