Saplings as fee: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్.. డబ్బులు వద్దు.. మొక్కలు ఇస్తే చాలు..

ప్రతీకాత్మక చిత్రం

మొక్కలనే ఫీజుగా తీసుకునే పాఠశాల/కోచింగ్ సెంటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి స్కూల్ ఒకటి బీహార్‌లో ఉంది. అక్కడ డబ్బులు తీసుకోరు. మొక్కలు ఇస్తే చాలు. ఉచితంగా కోచింగ్ ఇస్తారు.

  • Share this:
ఈ రోజుల్లో ఏ పాఠశాల లేదా కళశాలలో చేరాలన్నా వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లించక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు కోచింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌లు కూడా భారీగా ఫీజులు వసూలు చేస్తాయి. కానీ మొక్కలనే ఫీజుగా తీసుకునే పాఠశాల/కోచింగ్ సెంటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి స్కూల్ ఒకటి బీహార్‌లో ఉంది. రాష్ట్రంలోని సంస్థీపుర్ జిల్లాలో ఓ పాఠశాలలో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. అయితే అభ్యర్థుల నుంచి ఫీజుగా డబ్బులకు బదులుగా మొక్కలను స్వీకరిస్తారు. గ్రీన్ పాఠశాల అని పిలిచే ఈ సంస్థను 2008 నుంచి కొందరు యువకులే నడిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 32 ఏళ్ల రాజేశ్ కుమార్ సుమన్ అనే వ్యక్తి ఈ పాఠశాల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. బీహార్ సంస్థిపుర్ జిల్లాలోని విద్యా వాలంటీర్ల సహాయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి బాసటగా నిలుస్తున్నారు. ‘ట్రీ మ్యాన్’గా గుర్తింపు పొందిన రాజేశ్.. కోచింగ్‌ ఫీజుగా విద్యార్థుల నుంచి 18 మొక్కలను మాత్రమే స్వీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ‘బినోద్ స్మృతి స్టడీ క్లబ్’ కింద ఈ ప్రత్యేకమైన పాఠశాలను ప్రారంభించారు. తన మేనమామ జ్ఞాపకార్థం పేదవారికి సేవచేయాలనే తలంపుతో విద్యను అందిస్తున్నారు.

మొక్కలే ఎందుకు?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి గ్రీన్ పాఠశాలలో ఉదయం, సాయంత్రం ఉచిత సెషన్లలో కోచింగ్ ఇస్తున్నారు. ఇందుకు ఫీజుగా 18 మొక్కలను తీసుకోవడానికి ఓ శాస్త్రీయ కారణం ఉందని రాజేశ్ చెబుతున్నారు. ‘ఓ వ్యక్తి తన జీవితాంతం 18 మొక్కలు ఉత్పత్తి చేసేంత ఆక్సిజన్ పీల్చుకుంటాడు. కాబట్టి మేం 18 మొక్కలను ఫీజుగా వసూలు చేస్తున్నాం. అనంతరం వాటిని వివిధ ప్రదేశాల్లో నాటుతాం" అని రాజేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం, కోచింగ్ లేని ఇతర సెలవు రోజుల్లో రాజేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో పర్యటించి ఎక్కువ మొక్కలను నాటాలని అవగాహన కల్పిస్తారు.

2008 నుంచి ఈ గ్రీన్ పాఠశాలలో ఐదు వేల మందికిపైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందారు. ఇటీవలే ముగ్గురు మహిళలతో సహా 13 మంది విద్యార్థులు బీహార్ పోలీస్ పరీక్ష క్లియర్ చేసి సబ్ ఇన్స్పెక్టర్లుగా మారారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో 40 శాతం మంది ఆడవారు. ప్రారంభం నుంచి రాజేశ్ ఫీజుగా సేకరించిన మొక్కలు 90వేలకు పైనే ఉండటం విశేషం.
Published by:Shiva Kumar Addula
First published: