కూనూర్: తమిళనాడులోని కూనూరులో ఐఏఎఫ్ హెలికాఫ్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో సహా మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. డిసెంబర్ 8న జరిగిన ఈ ఘటనను కళ్లారా చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు కీలక విషయాలను వెల్లడించాడు. ఆ ప్రత్యక్ష సాక్షి పేరు కృష్ణ స్వామి. హెలికాఫ్టర్ గాల్లో నుంచి కింద పడుతుండగా తాను చూశానని ఆయన చెప్పాడు. పెద్ద శబ్దం వినిపించడంతో ఏంటా అని చూశానని.. ఆ సమయంలో మంటల్లో చిక్కుకున్న హెలికాఫ్టర్ గాలిలో పల్టీలు కొడుతూ కిందపడటాన్ని చూశానని తెలిపాడు.
ఒక పెద్ద చెట్టుపై హెలికాఫ్టర్ కుప్పకూలిందని.. దీంతో పడీపడగానే ఆ మంటలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పాడు. కిందపడుతున్న సమయంలో మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని చూశానని.. ఆ తర్వాత మరో నలుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని కాలిపోతుండటాన్ని గమనించానని కృష్ణస్వామి తెలిపాడు. మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో హెలికాఫ్టర్ కిందపడగానే బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడని కానీ రాలేకపోయాడని చెప్పాడు. హెలికాఫ్టర్ చెట్టుపై పడిన కొంతసేపటికే ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయని.. దీంతో భయంతో తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. తాను వెళ్లిపోయి మరో వ్యక్తికి విషయం చెప్పగా.. పోలీసులకు ఆ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడని కృష్ణ స్వామి తెలిపాడు.
అంతేకాదు.. హెలికాఫ్టర్ చెట్టును సమీపిస్తున్న సమయంలో పూర్తిగా మంటల్లో కాలిపోతూ ఉన్న ఓ వ్యక్తి లేచి నిల్చున్నాడని.. వెంటనే కిందపడిపోయాడని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అగ్నిమాపక సిబ్బందికి చెందిన రామచంద్రన్ మాట్లాడుతూ.. సీనియర్ అధికారులు వచ్చే హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో తమ శాఖలోని కొందరు అక్కడ ఉండటం తమ డ్యూటీ అని.. 12.20 అవుతున్నా హెలికాఫ్టర్ ఇంకా రాలేదని.. అరగంట వేచి చూసిన తర్వాత హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైందని తెలిసిందని చెప్పారు. దీంతో.. వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని.. హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రదేశం అడవిలో ఉండటంతో దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి అక్కడికి చేరుకోవాల్సి వచ్చిందని రామచంద్రన్ తెలిపారు. తాము వెళ్లి ఇద్దరు వ్యక్తులను బయటకు తీశామని.. వారిలో ఒకరు అప్పటికే 90 శాతం కాలిన గాయాలతో ఉండగా, మరొకరు 45 శాతం కాలిపోయి ఉన్నారని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bipin Rawat, Helicopter Crash, IAF, Tamilnadu