మా నాన్నను వెంటనే విడుదల చేయండి.. వరవరరావు ముగ్గురు కూతుర్ల లేఖ‌

కరోనా వైరస్ వ్యాప్తి వార్తలు మరింత ఆందోళన కలిగిస్తుందని, తక్షణం విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

news18-telugu
Updated: May 27, 2020, 10:56 AM IST
మా నాన్నను వెంటనే విడుదల చేయండి.. వరవరరావు ముగ్గురు కూతుర్ల లేఖ‌
వరవరరావు
  • Share this:
విప్లవ కవి వరవరరావును ఉంచిన మహారాష్ట్రలోని తలోజా జైల్లో కరోనా తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. కరోనా సోకి ఒకరు మరణించారని ప్రభుత్వమే ప్రకటించింది.ఈ నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయనకు ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్య‌లున్నాయని, దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి వార్తలు మరింత ఆందోళన కలిగిస్తుందని, తక్షణం విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘సర్, మా తండ్రి, ప్రముఖ విప్లవ కవి వరవరరావుపై తప్పుడు అభియోగాలతో మోపిన ఒక కేసులో మహారాష్ట్ర జైళ్ళలో (2020 ఫిబ్రవరి వరకు పూణేలోని ఎరవాడ జైలులోనూ, తర్వాత నవీముంబైలోని తలోజా జైలులోనూ) ఖైదీగా ఉన్నారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త (ముంబై హైకోర్టులో సోమవారం ఒక ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది) మమ్ములను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

మా నాన్న వయస్సు 80 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం దుర్బలంగా ఉన్నందున ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదమున్నది. ఎనిమిది వారాల క్రితం లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత జైలులో మా తండ్రిని సందర్శించేందుకు మాకు అనుమతి లభించలేదు. సాధారణ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి కూడా అనుమతినివ్వలేదు. ఆయన్ని సందర్శించేందుకు న్యాయవాదులను సైతం అనుమతించడం లేదు. ఈ ఎనిమిదివారాలుగా మా నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు మేము ఎంతో వ్యాకులతతో ఆతురపడుతున్నాము. 70 సంవత్సరాలకు పైబడిన వయస్సులో వుండి, అనారోగ్యంతో బాధపడుతున్న మా తల్లితో మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు మా నాన్నను అనుమతించారు.

ఆయన మా అమ్మతో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించారు. మా నాన్నఇప్పుడు విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే. గత 47 సంవత్సరాలలో మా తండ్రిపై మోపిన 25 కేసులలోనూ ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 21 విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పిం చింది. రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఉన్న ఈ హక్కుకు ఇప్పుడు ప్రమాదం వాటిల్ల కూడదు. తలోజా జైలులో ఖైదీ మరణం గురించి, కొవిడ్ -19 వ్యాప్తి గురించి వార్తా పత్రికల్లో చదివాం. తలోజా జైలు అధికారులను కలిసి మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయాలని మా న్యాయవాది పద్మను అడిగాం. ఆమె ఈ విషయమై తలోజా జైలు అధికారులకు ఫోన్ చేయగా, ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకున్నారు గానీ, న్యాయవాది ప్రశ్నలకు ప్రతి స్పందించలేదు.

మా తండ్రి శ్రేయస్సు గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఆతురపడుతున్నాము. వయస్సు, ఆరోగ్యం, కొవిడ్- 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వరవరరావును తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలి. వరవరరావు భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్వయంగా నిర్ధారించుకుని, భరోసా పొందేందుకు ఆయనను జైలులో సందర్శించేందుకు కుటుంబ సభ్యులకు అనుమతినివ్వాలి. కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్ చేసేందుకు, ఉత్తరాలు రాసేందుకు ఆయనకు అనుమతినివ్వాలి. జైలులో మా నాన్నతో సమావేశమయ్యేందుకు న్యాయవాదులను అనుమతించాలి.’ అంటూ వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన లేఖలో పేర్కొన్నారు.
First published: May 27, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading