కరోనా (corona) ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతోంది. తగ్గిపోయిందనుకున్న కోవిడ్ (Covid 19) మళ్లీ పడగలిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు జరిగే పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ (Omicron variant) పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ సౌతాఫ్రికా వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ (Pm Naredra modi) ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల, రాకపోకల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఆంక్షలను విధించాయి.
ప్రయాణికులపై గుజరాత్ ఆంక్షలు..
ఒమెక్రాన్ వ్యాప్తికి తావు లేకుండా కట్టడి చర్యలకు దిగాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదివారం నాడు లేఖలు రాసింది. కొత్త మహమ్మారి కట్టడి బాధ్యత రాష్ట్రాలదేనంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదివారం నాడు లేఖలు రాశారు. అందులోనే తాజా మార్గదర్శకాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం విదేశీ ప్రయాణికులపై కొత్త ఆంక్షలను విధించింది. యూరప్, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్‌లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలంది. ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.
72 గంటల ముందే పరీక్షలు..
మహారాష్ట్రలోకి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వ్యాక్సిన్ వేయించుకోవాలంది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. లేదా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీలో..
ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకూండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Covid 19 restrictions, Delhi, Gujarat, Maharashtra, Omicron corona variant, PM Narendra Modi