Extramarital Affair: అఫైర్ నడుపుతున్న మహిళలు అలాంటోళ్లని నిర్ధారణకు రావడం సరికాదన్న కోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ఓ కేసులో తాజాగా పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆసక్తికర చర్చకు దారితీసింది. పంజాబ్‌కు చెందిన ఓ జంట కెరీర్‌లో ఎదగడం కోసం కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.

 • Share this:
  చండీగఢ్: భర్తకు దూరంగా ఒంటరి జీవనం గడుపుతున్న మహిళలంటే సమాజంలో సహజంగానే ఒక చిన్నచూపు ఉంటుంది. కొందరైతే అలా జీవిస్తున్న మహిళలపై ఒకడుగు ముందుకేసి లేనిపోని పుకార్లు పుట్టిస్తుంటారు. అలాంటి మహిళల క్యారెక్టర్‌నే తప్పుబడుతుంటారు. ఆమెకు వివాహేతర సంబంధాలున్నాయని.. ఆమె అలాంటిదని, ఇలాంటిదని మాట్లాడుకునే నోళ్లకు అడ్డూఅదుపు ఉండదు. అలా కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో భర్తలకు దూరమై ఉండొచ్చు గానీ, భర్తలకు దూరమైన మహిళలంతా అలాంటి వాళ్లు కాదు. భర్తకు దూరమైనప్పటికీ పిల్లలను బాధ్యతగా పెంచి పోషించి.. బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందించిన తల్లులు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఓ కేసులో తాజాగా పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆసక్తికర చర్చకు దారితీసింది. పంజాబ్‌కు చెందిన ఓ జంట కెరీర్‌లో ఎదగడం కోసం కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియా ఉన్న సమయంలోనే ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. ఆ పాప అక్కడే పెరిగింది. 2019లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇద్దరి మధ్య రోజూ ఏదో ఒక గొడవ. ఇక ఇద్దరూ కలిసి ఉండటం కష్టమని విడిపోవాలని నిర్ణయించుకుని భర్త నుంచి విడాకుల కోరుతూ ఆస్ట్రేలియా ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్‌లో ఆ మహిళ విడాకులకు దరఖాస్తు చేసింది.

  విడాకులు రావడమే తరువాయి అనే సమయంలో తన పద్ధతి మార్చుకుంటానని.. ఇక నుంచి ఇద్దరం ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉందామని భార్యను ఆ భర్త బతిమాలాడు. దీంతో.. ఆ మహిళ కూడా విడాకులపై వెనక్కి తగ్గి భర్తతో కలిసి ఉంటోంది. ఇద్దరూ ఈ క్రమంలోనే జనవరి 2020లో పాపతో కలిసి ఇండియాకు వచ్చారు. ఇండియాకు రాగానే ఆమె భర్త ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. తన బంధువుతో వివాహేతర సంబంధం నడుపుతున్నావని, ఆ సంగతి తనకు తెలుసని.. ‘నీలాంటి మహిళ దగ్గర పాప పెరగడం నాకు ఇష్టం లేదు’ అని ఆ భర్త పాప పాస్‌పోర్ట్‌ను తన వద్ద ఉంచుకుని.. పాపను కూడా అప్పటి నుంచి తానే పెంచుతున్నాడు. అంతేకాదు.. పాప కావాలని గొడవ చేస్తే చంపుతానని ఆమెను బెదిరించాడు.

  దీంతో.. భయపడిన ఆ మహిళ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయి అక్కడి ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన తన కూతురిని తనకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసింది. 2020, ఏప్రిల్‌‌లో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆమెకు పాపను అప్పగించాలని ఆమె భర్తకు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త ఇండియాలోనే ఉండటంతో పంజాబ్ కోర్టులో కూడా కూతురిని అప్పగించాలని కోరుతూ సదరు మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఆ మహిళ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ బెంచ్ తాజాగా తీర్పునిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన మహిళ ఆస్ట్రేలియాలో ఉండటంతో ఆమె తల్లికి పాపను అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

  ఇది కూడా చదవండి: Love Marriage: ఇంట్లో నుంచి వెళ్లిపోయి కూతురి ప్రేమ పెళ్లి.. లోకాన్నే వదిలివెళ్లిపోయిన తల్లిదండ్రులు..

  అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న మహిళలంతా మంచి తల్లులు కాదని నిర్ధారణకు రావడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఒంటరి మహిళల పెంపకంలో పెరిగిన వారిలో చాలామంది బాధ్యతగా పెరిగిన వారున్నారని, దేశాన్ని ఉన్నతంగా నిలిపేందుకు పలు రంగాల్లో సేవలందిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయానికొస్తే.. సదరు మహిళ ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి 70,000 ఆస్ట్రేలియన్ డాలర్లు సంపాదిస్తున్నారని, పాపను పెంచగలిగే స్థోమత ఆమెకు ఉందని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన మహిళ ఇండియాకు రాగానే ఆమెకు పాపను అప్పగించాలని ఆమె భర్తకు కోర్టు ఆదేశాలు పంపింది. హిందూ మైనారిటీ మరియు గార్డియన్‌షిప్ యాక్ట్, 1956 ప్రకారం.. బిడ్డకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకూ తల్లి సంరక్షణలో పెరగాలన్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ వయసులో.. బిడ్డకు తల్లి ప్రేమ, ఆప్యాయత ఎంతో అవసరమని కూడా కోర్టు అభిప్రాయపడింది.
  Published by:Sambasiva Reddy
  First published: