• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • THE MADRAS HIGH COURT CAME DOWN HEAVILY ON THE ELECTION COMMISSION OF INDIA FOR ALLOWING POLITICAL RALLIES DURING THE COVID19 PANDEMIC SSR

Chennai: కరోనా సెకండ్ వేవ్‌కు ఎన్నికల సంఘమే కారణం.. హత్య కేసు పెట్టాలన్న మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టు (File)

కోవిడ్-19 సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ఏకైక కారణం ఎన్నికల సంఘమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా..

  • Share this:
    చెన్నై: భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దేశంలో కోవిడ్-19 ఉపద్రవం ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ ఎలక్షన్ కమిషన్ కౌన్సిల్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ఏకైక కారణం ఎన్నికల సంఘమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కోవిడ్ నిబంధనలను అమలుపరచడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చాలామంది ఫేస్ మాస్క్‌లు ధరించలేదని, శానిటైజర్లు వినియోగించలేదని.. భౌతిక దూరం పాటించలేదని కోర్టు మండిపడింది. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం రాజ్యాంగ సంస్థల కర్తవ్యమని, పౌరులు బతికుంటేనే వాళ్లు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారని చీఫ్ జస్టిస్ గుర్తుచేశారు. పౌరులను బతికించుకోవడం, కాపాడుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ముందున్న కర్తవ్యమని.. ఏదైనా ఆ తర్వాతేనని చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజుకు సంబంధించి హెల్త్ సెక్రటరీతో చర్చించి తగిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని.. కోవిడ్-19 ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని తమిళనాడు ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు సూచించింది.

    మే 2న.. కౌంటింగ్ రోజున కోవిడ్-19 ప్రొటోకాల్‌ను పాటించేలా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో బ్లూప్రింట్‌ను కోర్టుకు సమర్పించాలని.. లేని పక్షంలో ఎన్నికల కౌంటింగ్ నిలిపి వేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు కూడా కోర్టు వెనకాడదని మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష జరుపుతుందని బెంచ్ తెలిపింది. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుతో ముందుకెళ్లి ప్రచారం చేయగా.. డీఎంకే కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లింది.

    దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ బీజేపీ నేతలంతా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలు తమిళనాడులో కోవిడ్-19 తీవ్రత పెరగడానికి కారణమయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు ముందుగానే మేల్కొని వర్చువల్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఉంటే ఈ స్థాయిలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యేవి కాదనే చర్చ జరుగుతోంది.

    తమిళనాడులో ఆదివారం కొత్తగా 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 4206 కేసులు ఒక్క చెన్నై నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దీంతో.. తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరింది. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో ఆదివారం ఒక్కరోజే కరోనా సోకిన వారిలో 82 మంది చనిపోయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
    Published by:Sambasiva Reddy
    First published: