హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం పదవికి నారాయణ స్వామి రాజీనామా

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం పదవికి నారాయణ స్వామి రాజీనామా

లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి రాజీనామా లేఖ అందిస్తున్న నారాయణ స్వామి

లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి రాజీనామా లేఖ అందిస్తున్న నారాయణ స్వామి

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి విఫలమయ్యారు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే...

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి విఫలమయ్యారు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. రాజ్ నివాస్‌కు వెళ్లి తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి సమర్పించారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రసంగించిన సీఎం నారాయణ స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల కోసం రాత్రింబవళ్లూ పనిచేశామని ఆయన చెప్పారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పనిచేసిన కిరణ్ బేడీ ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని సీఎం ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల మద్దతుతో ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులడినప్పటికీ మంజూరు చేయలేదన్నారు.

ఇదిలా ఉంటే.. పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. నారాయణ స్వామి ప్రభుత్వం గట్టెక్కడానికి అవసరమైన 14 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కు కరువైంది. కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. విశ్వాస పరీక్షకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే పొత్తుతో ఉన్న అధికార పక్షం విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే కుప్పకూలింది.

గడచిన నెల రోజుల వ్యవధిలో పుదుచ్చేరిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే అధికార పక్షానికి గుడ్‌బై చెప్పారు. ఎన్ ధనవేలు అనే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. దీంతో.. అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి కాంగ్రెస్ నుంచి 10, డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. విశ్వాస పరీక్షకు ముందు రోజే కె. లక్ష్మీనారాయణన్ అనే డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేశారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీలో పడిందని, తన రాజీనామా వల్ల పెద్ద మార్పు ఏమీ లేదని చెప్పారు. అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కు తగ్గింది. ఇక.. విపక్ష పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి బలం 14గా ఉంది. ఇందులో.. ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు.

First published:

Tags: Congress, DMK, Narayana Swamy, Puducherry

ఉత్తమ కథలు