వృద్ధుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ (అమెండ్‌మెంట్) బిల్లుకు త్వరలో మోక్షం కలగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ బిల్లును 2019లోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ పార్లమెంట్ దీనికి ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అయితే ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో చేపట్టే 29 బిల్లుల్లో 2019 సవరణ బిల్లు కూడా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 18న వెల్లడించింది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల ప్రాథమిక అవసరాలు తీరుస్తూ వారికి మానసికంగా, శారీరకంగా భద్రత కల్పించడానికి పాటుపడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులోనే భాగంగానే మోడీ సర్కార్ 2019లో వృద్ధుల సంక్షేమం కోసం చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి వంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఈ సవరణల బిల్లుకు ఆమోద ముద్ర వేస్తుందని తెలుస్తోంది.
ఈ బిల్లులో ప్రతిపాదించిన ముఖ్య సవరణల గురించి తెలుసుకుందాం.
1. కొత్త బిల్లు ప్రకారం, పిల్లల నిర్వచనం పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులకు పిల్లలు అంటే కేవలం కన్నవారు మాత్రమే కాదు.. దత్తపుత్రులు, కుమార్తెలు, సవతి పిల్లలు, అల్లుడు, మనవడు, మనవరాళ్లు కూడా పిల్లల కోవలోకే వస్తారు.
2. తల్లిదండ్రుల నిర్వచనం కూడా పూర్తిగా మారిపోయింది. కన్నతండ్రి, పెంపుడు తండ్రి, కన్నతల్లి, పెంపుడు తల్లి, తాతలు, మామ, అత్తలు కూడా తల్లిదండ్రుల కోవలోకే వస్తారు.
3. కొత్త బిల్లు ప్రకారం "మెయింటెనెన్స్" అనే పదానికి కూడా ఒక నిర్వచనం ఉంది. తల్లిదండ్రులు గౌరవంగా బతకడానికి అవసరమైన ఆహారం, దుస్తులు, వసతి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, చికిత్స అందించడమే మెయింటెనెన్స్ అసలైన నిర్వచనం.
4. 2007 చట్టం ప్రకారం, వృద్ధుల నెలవారీ మెయింటెనెన్స్ కోసం రూ.10,000 కంటే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు ఒక మాక్సిమం లిమిట్(upper/maximum limit) పెట్టారు. కానీ సవరణ బిల్లులో నెలవారీ గరిష్ట పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. ఒకవేళ సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడి చట్టంగా మారితే, సీనియర్ సిటిజన్లు 10 వేల రూపాయల కంటే ఎక్కువగా పొందొచ్చు.
5. మెయింటెనెన్స్ వ్యవహారాలను చూసుకోవటానికి ప్రత్యేకన్యాయస్థానం.. తల్లిదండ్రుల, సీనియర్ సిటిజన్ల జీవన ప్రమాణాలను పరిశీలిస్తుంది.
6. 2007 చట్టం ప్రకారం పిల్లలు ట్రిబ్యునల్ ఆదేశించిన 30 రోజులలోపు మెయింటెనెన్స్ డబ్బు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుత సవరణ బిల్లు ప్రకారం పిల్లలు 15 రోజులలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
7. సవరణ బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను విడిచిపెట్టిన/దూషించిన పిల్లలకు 3-6 నెలల జైలు శిక్ష పడొచ్చు లేదా రూ.10,000 విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Centre government, India, Parliament