శబరిమల (Sabarimala).కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుం ది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు.
2 నెలల సుదీర్ఘ యాత్ర మండల-మకరు విళక్కు పూజల కోసం నవంబరు 16న కేరళ (Kerala)లో శబరిమల ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. మండల పూజలు ముగియడంతో డిసెంబరు 26 న ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మకరు విళక్కు కోసం గురువారం సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోగా.. శుక్రవారం ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. డిసెంబరు 31 నుంచి జనవరి 19 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు దర్శనానికి అనుమతిస్తారు.
మకర జ్యోతి దర్శనం జనవరి 14న ఉంటుంది. ఈ నెల 19 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఈ మేరకు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం (All India Ayyappa Seva Sangham) ప్రతినిధి అరుణ్ గురుస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలకాల ఉత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం దేవస్థానం తిరిగి తెరుచుకుందని, జనవరి 19 వరకు భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయ్యప్ప భక్తుల కోసం దేవస్థానం బోర్డు రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గాన్ని తెరిచింది. జనవరి 1 నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ప్రతిరోజూ ఉదయం 5.30- రాత్రి 10.30 మధ్య ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. ఇందుకోసం భక్తులు నీలక్కల్, ఎరుమేలి వద్ద స్పాట్‌బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దర్శనం స్లాట్ నిర్ధారణ టికెట్‌తో పాటు రెండు డోసుల టీకా ధ్రువీకరణ లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ (RTPCR Negative) రిజల్ట్ సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాలి.
భక్తుల కోసం ఎరుమేలి, అలుద, కరిమల, పెరియనపట్టం, పంబ తదితర ప్రాంతాల్లో ఏబీఏఎస్ఎస్ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలతో పాటు అన్నదాన కేంద్రాలను ఏర్పాటుచేశాం. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక మకరవిలుక్కు ఉత్సవ సమయంలో భక్తులు దర్శనానంతరం శబరిమలలో ఎక్కువ సేపు బస చేయకూడదు. వెంటనే పంబకు తిరిగి వచ్చేయాలి’ అని అరుణ్ గురుస్వామి సూచించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.