హర్యానాలో బోరుబావిలో పడ్డ చిన్నారి కథ సుఖాంతమైంది. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన ఆ పసివాడు..బోరుబావి నుంచి తల్లి ఒడికి చేరాడు. ఐతే బాలుడు నీరసంగా ఉండడంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
గురువారం హిస్సార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో 18 నెలల బాలుడు బోరుబావిలో పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు తెరిచిఉన్న బోరు బావిలో పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఏడుస్తూ పోలీసులకు సమాచారం అందించడంతో..వాళ్లు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలను రప్పించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
బోరుబావి 60 అడుగుల లోతు ఉందని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది..సమాంతరంగా గొయ్యి తవ్వారు. బాలుడికి శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ట్యూబ్ల ద్వారా రాత్రంతా బోరుబావిలోకి ఆక్సీజన్ పంపించారు. దాదాపు 20 గంటల ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. బాబును కాపాడేందుకు స్థానికులు, సహాయక బృందాలు రాత్రంతా తీవ్రంగా శ్రమించాయి. తమ ప్రయత్నాలు ఫలించి చిన్నారి క్షేమంగా తిరిగిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Visuals: The 18 month-old-boy who had fallen into a 60-feet deep borewell in Hisar's Balsamand village yesterday, has been rescued. #Haryana pic.twitter.com/DMAeoM1tMP
— ANI (@ANI) March 22, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana