హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Udaipur : ఒంటిపై 26 కత్తిపోట్లు.. కరాచీ ఉగ్ర సంస్థతో లింక్.. దాడి ఇస్లాంకు వ్యతిరేకమన్న ఇమామ్‌లు

Udaipur : ఒంటిపై 26 కత్తిపోట్లు.. కరాచీ ఉగ్ర సంస్థతో లింక్.. దాడి ఇస్లాంకు వ్యతిరేకమన్న ఇమామ్‌లు

Udaipur : రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగిన ఘటన దేశమంతటా సంచలనం రేపుతోంది. కస్టమర్లలా నటిస్తూ.. జూన్ 28నాడు ఉదయ్ పూర్ లోని టైలరింగ్ షాపులోకి వచ్చిన దుండగులు.. టైలర్ కన్హయ్య లాల్ పీక కోశారు. ఐతే.. టైలర్ పోస్టుమార్టమ్ రిపోర్ట్ లో కిరాతకం ఎంత దారుణంగా జరిగిందో బయటపడింది. కన్హయ్యలాల్ ఒంటిపై 26 కత్తిపోట్లు ఉన్నాయని.. మెడపై 10 గాట్లు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.

మంగళవారం పలు హింసాత్మక ఘటనలు జరగడంతో రాజస్థాన్ సర్కారు అలర్టైంది. ఈ ఘటనతో మత కల్లోలాలు చెలరేగకుండా ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అటు కేంద్ర హోంశాఖ కూడా అలర్టై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఉగ్ర మూలాలు ఉండటంతో కేసు దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ- NIAకు అప్పగించింది.


నిన్న హత్య జరిగిన తర్వాత రాజస్థాన్ హోంశాఖ దీనిపై సిట్ ను ఏర్పాటుచేసింది. ADG అశోక్ కుమార్ రాథోడ్, ఏటీఎస్ ఐజీ ప్రఫుల్లా కుమార్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీలతో దర్యాప్తు చేయించింది. సూరజ్ పోలే ఏరియాకు చెందిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్న గౌస్ మొహమ్మద్ , రియాజ్ లను ప్రశ్నించారు. పాకిస్తానీ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్ సెల్స్ ఈ పని చేశాయని సమాచారం అందడంతో.. కేసు దర్యాప్తు కోసం NIAను రంగంలోకి దించారు ఉన్నతాధికారులు. యాంటీ టెర్రర్ యాక్ట్ కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2014లో దావత్ -ఏ-ఇస్లామీ సంస్థ దగ్గర వీళ్లు శిక్షణ పొందినట్టు అధికారులు కూపీ లాగారు.

ఉదయ్ పూర్ హత్యను ఢిల్లీ జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వానికే వణుకు లాంటి ఘటన అన్నారు. ఇది పిరికిపందల చర్య అనీ.. అమానవీయమని.. అన్యాయమని చెప్పిన ఆయన.. ఇలాంటి దాడులు ఇస్లాంకు వ్యతిరేకమని చెప్పారు. భారతీయ ముస్లింలందరి తరపున ఈ హత్యను ఖండిస్తున్నామని చెప్పారు జామా మసీద్ షాహీ ఇమామ్.

మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ తో వివాదం రేపి బీజేపీ నుచి బహిష్కృతురాలైన నుపుర్ శర్మకు మద్దతుగా కన్హయ్య లాల్ స్టేటస్ పెట్టుకోవడం నచ్చని దుండగులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. తన తండ్రికి బెదిరింపులు వచ్చాయని.. సెక్యూరిటీ కావాలని పోలీసులను కోరినా స్పందించలేదని కొడుకులు యశ్, తరుణ్ జాతీయ మీడియాతో చెప్పారు. నిందితులను చచ్చేవరకు ఉరి తీయాలని, వెంటనే మరణ దండన అమలు చేయాలని కన్హయ్య లాల్ భార్య, కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Rajastan

ఉత్తమ కథలు