పేరుకు వివాదాస్పద స్థలమే అయినప్పటికీ.. మత అంశంగా మూడు దశాబ్దాల పాటు న్యాయస్థానాల్లో నలిగిన అయోధ్య-బాబ్రీ మసీదు కేసుకు ఎట్టకేలకు తెరపడింది. వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది.ఆ స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. దీంతో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న హిందువుల కల నెరవేరడానికి మార్గం సుగమం అయింది.
శనివారం ఉదయం 10.30గంటలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కాపీలను ఓపెన్ చేసింది. అనంతరం తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు.
వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ముస్లింలకు మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీం ఆదేశించింది. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాలని చెప్పింది.
వివాదాస్పద స్థలం తమదేనన్న నిర్మోహి అఖారా అప్పీల్‌ను సుప్రీం కొట్టివేసింది. అయితే సెక్షన్ 142 ప్రకారం అయోధ్య ట్రస్టులో నిర్మోహి అఖారాకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించింది.
1528లో బాబర్ ఆ మసీదును నిర్మించాడు. అయితే దాన్ని ఖాళీ స్థలంలో నిర్మించలేదు. కట్టడం కింద మరో మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి.-సుప్రీం కోర్టు
పురావస్తు శాఖ నివేదికలో అక్కడ మసీదు,ఈద్గా నిర్మాణాలు ఉన్నట్టు ఆధారాలేమి లేవు. 1885కి ముందు అక్కడ హిందువులు కూడా పూజలు చేసేవారు. రామ్‌చతరబుత్రా, సీతారసోయ్ దగ్గర అక్కడ పూజలు జరిగేవి.-సుప్రీం తీర్పు
వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లా విరాజ్‌మన్,నిర్మోహి అఖారా,సున్నీ వక్ఫ్ బోర్డులకు పంచుతూ గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుపట్టింది.
అయోధ్యను రాముడి జన్మస్థలంగా హిందువులు విశ్వసిస్తారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని సుప్రీం తెలిపింది.
హిందువుల నమ్మకం నిజమైనది కాదనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నమ్మకానికి విలువ ఉందా లేదా అని తేల్చడం
కోర్టు పరిధిలో లేదని సుప్రీం స్పష్టం చేసింది.
చరిత్ర,మతపరమైన,న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని వివాదాస్పద స్థలంపై తీర్పు వెల్లడించామని సుప్రీం స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Supreme Court