టాటా గ్రూప్‌కు పార్లమెంటు కొత్త భవన నిర్మాణ కాంట్రాక్ట్ ..వ్యయం ఎంతంటే?

ప్రస్తుత పార్లమెంటు భవనం

New Parliament Building Construction | పార్లమెంటు కొత్త భవనం నిర్మాణ పనుల కాంట్రాక్టును టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ తృటిలో ఈ ప్రాజెక్టును చేజార్చుకుంది.

 • Share this:
  Parliament New Building: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను టాటా గ్రూప్‌కు చెందిన టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి అర్హత కలిగిన పలు కంపెనీల నుంచి కేంద్ర ప్రజా పనుల శాఖ(CPWD) బిడ్స్‌ను స్వీకరించింది. తుది బిడ్స్‌ను సెప్టెంబర్ 16న(బుధవారం) సీపీడబ్ల్యూడీ అధికారులు తెరచారు. టాటా ప్రాజెక్ట్స్‌కు దీని నిర్మాణానికి టాటా ప్రాజెక్ట్స్ అతి తక్కువగా రూ.861.90 కోట్లకు బిడ్డింగ్ చేసింది. దీంతో నూతన పార్లమెంటు నిర్మాణ కాంట్రాక్ట్‌ను  ఆ సంస్థకు ఖరారు చేశారు. టాటా ప్రాజెక్ట్స్ తర్వాత అతి తక్కువగా లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) రూ.865 కోట్లకు బిడ్డింగ్ చేసింది. కేవలం రూ.4.10 కోట్లతో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టును చేజార్చుకుంది.

  పలు కంపెనీలు పార్లమెంటు నూతన భవన నిర్మాణం కోసం బిడ్డింగ్స్ సమర్పించాయి. గత నెల వీటిని పరిశీలించిన అధికారులు...బిడ్డింగ్స్ సమర్పించిన వాటిలో మూడు సంస్థలు టాటా ప్రాజెక్ట్స్, లార్సన్ అండ్ టుబ్రో, షాపోర్జి పలోంజి అండ్ కంపెనీలను తుది బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.

  ప్రస్తుత పార్లమెంటు భవనానికి సమీపంలోనే కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 21 మాసాల వ్యవధిలో ఈ నిర్మాణ పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. రూ.889 కోట్ల వ్యయంతో నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రీ-బిడ్డింగ్ అర్హతకు సంబంధించిన నోటీసులో స్పష్టంచేశారు. పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నెం.118లో పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.

  బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికావడంతో టాటా ప్రాజెక్ట్స్ త్వరలోనే పార్లమెంటు కొత్త భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముంది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఆర్థిక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు కొత్త భవనం అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
  Published by:Janardhan V
  First published: