news18-telugu
Updated: October 19, 2020, 4:10 PM IST
పళనిస్వామి(ఫైల్ ఫొటో)
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలతో భారీగా ఆస్తి నష్టంతో పాటుగా, పలు చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పటికి పలు ప్రాంతాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు బ్లాంకెట్స్, ఇతర రిలీఫ్ మెటీరియల్ పంపిచనున్నట్టు ఆయన చెప్పారు. తక్షణమే రూ. 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్ఎఫ్కు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే మరే ఇతర సహాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
పళనిస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు..వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నగదుతో పాటు బ్లాంకెట్స్, చద్దరు్ల, ఇతర సామాగ్రి కూడా పంపుతామని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సాయం చేసేందుకు ఎంతో ఉదారతతో ముందుకు వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామికి, ఆ రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చూపాలని కోరారు. దాతలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపవచ్చని తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 19, 2020, 3:56 PM IST