తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. గతంలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్.. పార్టీ పెట్టే విషయంపై మాత్రం కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం అభిమానులతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన రజినీకాంత్.. ఆ సమావేశంలోనే దీనిపై స్పష్టత ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే ఆ రోజు అభిమాన సంఘం నేతలతో సమావేశమైన రజినీకాంత్.. త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారు. దీంతో ఆయన ఏం చెబుతారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే నేడు ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించిన రజినీకాంత్.. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తమిళనాట అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొద్దిరోజుల క్రితం అభిమాన సంఘం నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై అభిమానులు రజినీకాంత్‌ను గట్టిగానే నిలదీసినట్టు వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తేనే తాము మీ వెంట నడుస్తామని వాళ్లు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ విషయంపై అతి త్వరగా నిర్ణయం తీసుకుంటేనే రాబోయే ఎన్నికల్లో ఏదైనా చేయగలమని రజినీకాంత్ ముందు అభిమాన సంఘం నేతలు కుండబద్ధలు కొట్టారు. వారి వాదనను ఓపిగ్గా విన్న రజినీకాంత్.. తరువాత తన నిర్ణయం ప్రకటిస్తానని వారికి తెలిపారు. తాజాగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు నేడు ప్రకటన చేశారు.
A political party will be launched in January; Announcement regarding it will be made on December 31st, tweets actor Rajinikanth pic.twitter.com/K2MikOk30I
— ANI (@ANI) December 3, 2020
సరిగ్గా మూడేళ్లు
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు డిసెంబర్ 31, 2017న ప్రకటించారు రజినీకాంత్. అయితే తాను కొత్త పార్టీ పెడతానని కానీ, వేరే పార్టీలో చేరతానని కానీ అప్పుడు ఆయన చెప్పలేదు. ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ప్రయత్నించలేదు. లోక్‌సభ ఎన్నికలు తమకు ప్రాధాన్యం కాదని ప్రకటించారు. మూడేళ్ల నుంచి రాజకీయాలపై రజినీకాంత్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే మరికొన్ని నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ వేడి పుట్టించారు. మూడేళ్ల క్రితం డిసెంబర్ 31న రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్.. రాబోయే డిసెంబర్ 31న తన కొత్త పార్టీ వివరాలు ప్రకటించనున్నారు.
రజినీ కంటే ముందే కమల్
రజినీకాంత్ తరువాత పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన మరో ప్రముఖ నటుడు కమలహాసన్.. ఇప్పటికే పార్టీని కూడా స్థాపించారు. మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమలహాసన్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగానే బరిలోకి దిగుతామని అన్నారు. రజినీకాంత్ తమతో కలిసి వస్తే స్వాగతిస్తామని అన్నారు. అటు కమలహాసన్, ఇటు రజినీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవడంతో.. ఈసారి తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు స్టార్ వార్‌ను తలపించడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tamilnadu