Taj Mahal: తాజ్‌మహల్‌ను పేల్చేస్తాం.. బాంబు పెట్టామని బెదిరింపు.. ఆగ్రాలో హైఅలర్ట్

తాజ్ మహల్

Bomb Threat to Taj Mahal: ఇప్పటి వరకైతే తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఐనప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

 • Share this:
  ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ పర్యాటక స్థలం తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి.. తాజ్‌మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అప్పటికే లోపల ఉన్న పర్యాటకులను హుటాహుటిన బయటకు తరలించారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేశాడు. తాజ్‌మహల్ లోపల బాంబులు పెట్టామని..కాసేపట్లో పేల్చేస్తామని చెప్పారు. ఆ ఫోన్ రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పర్యాటకులను బయటకు తరలించి.. తాజ్‌మహల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు.

  ఉత్తరప్రదేశ్ పోలీసులు, సీఐఎస్ఎఫ్‌తో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది తాజ్ మహల్ లోపల తనిఖీలు చేపట్టారు. ప్రతి చోటును చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఐనప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐతే పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా అధికారులు ఆరాతీస్తున్నారు. యూపీలోని ఫిరోజాబాద్ నుంచి కాల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


  తాజ్ మహల్.. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం. భారతీయులతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అలాంటి తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు రావడంతో ఆగ్రాలో తీవ్ర కలకలం రేగింది. యూపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. పర్యాటకులు సైతం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఐతే ఇది ఆకతాయి పనేనా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుబడితేనే.. దీనికి సంబంధించి మరింత కీలక సమాచారం తెలిసే అవకాశముంది.
  Published by:Shiva Kumar Addula
  First published: