కొన్నేళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రజినీకాంత్.. ఇంతకాలం తన పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చారు. అయితే తాజాగా ఆయన అభిమానులతో సమావేశం కావడంతో.. రజినీకాంత్ తన రాజకీయ భవిష్యత్తుపై ఈ భేటీలో పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని 30 జిల్లాల ఆయన అభిమాన సంఘం అధ్యక్షులతో ఈ భేటీ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రజినీకాంత్ మనసులో ఏముందనే విషయం మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. మరోవైపు ఈ సమావేశంలో రజినీకాంత్ అభిమానులు ఆయనకు ఒకరకంగా అల్టిమేటం ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్దిరోజుల సమయం మాత్రమే ఉందని... ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అభిమాన సంఘం నాయకులు రజినీకాంత్ ముందు కుండబద్ధలు కొట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో కలిసి నడుద్దామని రజినీకాంత్ మనోగతాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. సొంత పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తామని తెగేసి చెప్పారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ సమావేశంలో అభిమాన సంఘం నాయకులు చెప్పిన అన్ని విషయాలను రజినీకాంత్ అత్యంత ఓపిగ్గా విన్నారని.. తన సన్నిహితులతో చర్చించిన తరువాత దీనిపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు కొద్దిరోజుల క్రితం అమిత్ షా తమిళనాడులో పర్యటించడం.. ఆ తరువాత రజినీకాంత్ హఠాత్తుగా అభిమానులతో కీలక భేటీ నిర్వహించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రజినీకాంత్ ద్వారా తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... బీజేపీ తన ప్లాన్ అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రజినీకాంత్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రకటన చేస్తారు ? దాని పర్యవసానాలు తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tamilnadu