సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, ఐతే దానికి ఎవరు కారణమన్న దానిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే అసలు సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ముందు వరసలో ఉన్నారు. సుశాంత్ సింగ్‌ను ముమ్మాటికీ చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను చంపేశారనడానికి ఇవే ఆధారాలంటూ ఓ లిస్టును ట్వీట్ చేశారు సుబ్రమణ్య స్వామి. దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుశాంత్ కేసులో మొత్తం 26 సాక్షాధారాలు ఉన్నాయని సుబ్రమణ్య స్వామి ట్విటర్‌లో పేర్కొన్నారు. అందులో ఆత్మహత్య చేసుకున్నాడని అనుకోవడానికి రెండే ఆధారాలున్నాయని.. కానీ హత్య చేశారని భావించడానికి 24 ఆధారాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020
సుశాంత్‌ది హత్యగానే భావిస్తున్నానని కొన్ని కీలక పాయింట్లను ఆయన లేవనెత్తారు. మెడ మీద ఉన్న గుర్తులు, కళ్లు తేలేయక పోవడం, ఫ్యాన్‌కు వేలాడుతున్న వస్త్రం, శరీరం మీద ఉన్న వేర్వేరు గుర్తులు, సిసిటివి ఫుటేజీ, రూమ్ డూప్లికేట్ కీ మాయమవడం, సుశాంత్ సన్నిహితుల ప్రవర్తనా తీరు, దిశా సలియన్ ఆత్మహత్య, సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం, సుశాంత్ పదే పదే సిమ్ కార్డులను మార్చడం, ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం వంటివన్నీ హత్య అనే అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. డిప్రెషన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వంటి అంశాలు మాత్రమే సూసైడ్ థియరీకి సపోర్ట్ చేస్తున్నాయని.. మిగతా 24 అంశాలు మాత్రం మర్డర్ థియరీకి సపోర్ట్ చేస్తున్నాయని తెలిపారు.
సుశాంత్ కేసుకు సంబంధించి సుబ్రమణ్యస్వామి ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో మాట్లాడారు. సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు బయటకొస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలయింది. కాగా, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్య ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Subramanian Swamy, Sushant Singh Rajput, Sushanth singh Rajputh