బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ముంబై సెషన్స్ కోర్టులో షాక్ తగిలింది. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రియాతో పాటు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి, దీపేష్ సావంత్, శ్యామ్యూల్ మిరందా, డ్రగ్స్ వ్యాపారులు బాసిత్ పరిహార్, జైద్ విలాత్రా బెయిల్ అభ్యర్ధనలను కూడా కోర్టు తిరస్కరించింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని సెప్టెంబరు 8న ముంబైలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ పిటిషన్ వేశారు. ఐతే ఆమెకు బెయిల్ మంజూరు చేయకూడదన్న NCB వాదనతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సెషన్స్ కోర్టు తీర్పుపై రియా లాయర్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.
Once we get the order copy. We will decide next week on the course of action on approaching the High Court: Rhea Chakraborty's lawyer Satish Maneshinde https://t.co/aRZNuuYtPG
— ANI (@ANI) September 11, 2020
డ్రగ్స్ కొనుగోలుపై ఈమె నిజాలు ఒప్పుకుంది. తాను డ్రగ్స్ కొన్నట్లు చెప్పడంతో ఇప్పుడు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగి తేలే 25 మంది సెలబ్రెటీల లిస్ట్ కూడా ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే రియా సోదరుడు శోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శామ్యూల్ మిరాందాలను ఎన్‌సీబీ బృందం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రియా చక్రవర్తి.. ముంబై బైకుల్లో జైలులో ఉన్నారు. కోర్టు ఆమెకు సెప్టెంబరు 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇందులో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో ఆ కోణాన్ని ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో లింకులను జోడిస్తూ వెళ్లిన ఎన్‌సీబీ మొదట డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంతమందిని విచారించి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రియాను కూడా అరెస్ట్ చేశారు. ఇక సుశాంత్ ఖాతాల్లోని డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ కేసు బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితులను కాపాడేందుకు ఉద్ధవ్ థాక్రే సర్కార్ ప్రయత్నిస్తోందని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.