SURAT BLAZE THREE INCLUDING BUILDER BOOKED FOR CULPABLE HOMICIDE COACHING CLASS OPERATOR DETAINED NK
సూరత్ అగ్నిప్రమాదం : బిల్డర్లపై హత్య కేసు నమోదు... కోచింగ్ సెంటర్‌పై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
సూరత్‌లోని కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం దృశ్యం
Surat Fire Accident : ఇటీవల గుజరాత్లో ఇలాంటి మరికొన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా, అక్రమ భవనాలపై అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్... సూరత్‌లోని తక్షశిల కాంప్లెక్స్‌లోని కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఆ భవనాన్ని నిర్మించిన ఇద్దరు బిల్డర్లు హర్షల్ వికారియా, జిగ్నేష్‌పై హత్య కేసు నమోదైంది. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరికొందరు చనిపోయారు. కొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనంతటికీ కారణం... ఆ భవనానికి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉండటమే. పై అంతస్థులకు వెళ్లేందుకు చెక్కలతో చేసిన మెట్ల మార్గం మాత్రమే ఉంది. అగ్ని ప్రమాదంలో చెక్కమెట్లు తగలబడటంతో విద్యార్థులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ భవనంలో కోచింగ్ క్లాసులు చెబుతున్న క్లాస్ ఆపరేటర్ భార్గవ్ బుటానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో దేశం మొత్తాన్నీ కదిలించింది. సోషల్ మీడియాలో అది వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ప్రాణాలతో బయటపడేందుకు విద్యార్థులు భవనం పై నుంచీ కిందకు దూకేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేశాయి.
Video:-సూరత్ అగ్నిప్రమాదం: భవనంపై నుంచి దూకిన విద్యార్థులు..19 మంది మృతి
ఇందుకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆదేశించారు. ఈ భవనాన్ని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు తొలగించలేదన్నది చర్చనీయాంశమవుతోంది. 2001లో ఈ భవనానికి సూరత్ అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ... రెసిడెన్షియల్ సొసైటీ కింద అనుమతి ఇచ్చిందని తెలిసింది.
గాయపడిన విద్యార్థిని ఓదార్చుతున్న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ
2007లో ఇందులో అక్రమంగా ఓ షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 2012లో భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త రూల్స్ తెచ్చారు. 2013లో కొంత ఫీజు చెల్లించడం ద్వారా ఈ అక్రమ భవనానికి చట్టబద్ధత కల్పించారు. రెండో అంతస్థును కూడా లీగలైజ్ చేశారు. ఐతే... మూడో అంతస్థును అక్రమంగా నిర్మించారు. ఈ భవనంలో ఎక్కడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక యంత్రాలు
ఇటీవల గుజరాత్లో ఇలాంటి మరికొన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా, అక్రమ భవనాలపై అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018 నవంబర్ 26న సూరత్‌లోని వెసూ ఏరియాలోని ఆగం ఆర్కేడ్‌లో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు విద్యార్థులూ, ఓ టీచర్ చనిపోయారు.
గుజరాత్లో ప్రస్తుతం 3వేల కోచింగ్ సెంటర్లలో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు షాపింగ్ కాంప్లెక్సులలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. వాటిలో చాలా వరకూ అత్యంత ఇరుకు ప్రదేశాల్లో నిర్వహిస్తున్నవే. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం... ఎయిర్ కండీషనర్లో తలెత్తిన సాంకేతిక సమస్య లేదా షార్ట్ సర్క్యూట్ కావచ్చని భావిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.