ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను వాడకుండా, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టేలా ఉత్తర్వులివ్వాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు పరిశీలన..
మినీ సంగ్రామాన్ని తలపించేలా అతిపెద్ద ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోన్న సమయాన.. పాతదే అయినా సంచలన వివాదం ఒకటి మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను వాడకుండా, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టేలా ఉత్తర్వులివ్వాలని ఓ వ్యాజ్యం దాఖలు కాగా, దానిని పరిశీలనకు స్వీకరించడం ద్వారా సుప్రీంకోర్టు చర్చను ఆసక్తికరంగా మార్చింది.
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను వాడటంలో రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరపడం గురించి పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఈవీఎంలను వాడటాన్ని ప్రశ్నిస్తూ, బ్యాలట్ పేపర్లను ఉపయోగించేవిధంగా ఆదేశించాలన్నది పిటిషన్ లో ప్రధానాంశం.
న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందువల్ల తన పిటిషన్పై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్లను ఉపయోగించేవిధంగా ఆదేశించాలని కోరారు.
ఈవీఎంలను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్న నిబంధనను పార్లమెంటు ఆమోదించలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఈవీఎంలను ఎన్నికల్లో ప్రవేశపెట్టారని, పార్లమెంటు ఆమోదించని ఈ సెక్షన్ను రుద్దకూడదని అన్నారు. ఈ నిబంధన రాజ్యాంగవిరుద్ధం, శూన్యం అని ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, పిటిషన్ను పరిశీలిస్తామని చెప్పారు. దీనిని వేరొక ధర్మాసనానికి నివేదిస్తామని చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.