హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farm Laws: వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

Farm Laws: వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

సుప్రీంకోర్టు (ఫైల్)

సుప్రీంకోర్టు (ఫైల్)

Farms Laws: రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో అశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాస్, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధావంత్ సభ్యులుగా ఉండనున్నారు. రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండు రోజుల పాటు మూడు వ్యవసాయ చట్టాలపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వీటి అమలుపై స్టే విధించింది. తాము నియమించిన కమిటీ ముందుకు వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు రైతు సంఘాలకు సూచించింది.

  అయితే కమిటీ ముందుకు వెళ్లేందుకు రైతు సంఘాలు ముందుగా నిరాకరించాయి. అవసరమైతే సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించలేదు. కచ్చితంగా కమిటీ ముందుకు రైతు సంఘాలు తమ వాదన వినిపించాల్సిందే అని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఉన్నవారంతా ఈ కమిటీ ముందుకు తమ వాదనలు వినిపించాలని తెలిపింది. కమిటీ అందరి వాదనలు వింటుందన్న సుప్రీంకోర్టు.. ఆ తరువాత దీనిపై నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తుందని తెలిపింది. ఆ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

  అంతకుముందు దీనిపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రైతు సంఘాల తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఆ చట్టాలను రద్దు చేయడమే సమస్యకు పరిష్కారమని.. అలా జరిగితేనే ఆందోళనలు ఆగుతాయని అన్నారు. అయితే ఇందుకు సీజే బాబ్డే అంగీకరించలేదు. చట్టాలను తాము శాశ్వతంగా రద్దు చేయలేమని అన్నారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గణతంత్ర్య దినోత్సవ రోజున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సొలిటికల్ జనరల్ నివేదిక తరువాత నోటీసు జారీ చేస్తామని పేర్కొంది. మరోవైపు రైతులను కొందరు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని.. రైతులకు మేలు చేసేందుకే కేంద్రం కొత్త చట్టాలు తీసుకొచ్చిందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అందరి వాదనలు విన్న సమస్య పరిష్కారం కోస కమిటీని ఏర్పాటు చేసింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Farmers, Supreme Court

  ఉత్తమ కథలు