Supreme Court: యూపీలోని ఆ ఐదు నగరాల్లో హైకోర్టు లాక్‌డౌన్ ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్

సుప్రీంకోర్టు (ఫైల్)

ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరక్‌పూర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటినీ మూసివేయాలని, లాక్‌డౌన్ పాటించాలని.. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలని...

  • Share this:
    న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ విధించే అంశంలో ప్రభుత్వానికి, అలహాబాద్ హైకోర్టుకు మధ్య రేగిన వివాదం సుప్రీం విచారణతో కొత్త మలుపు తిరిగింది. ఐదు నగరాల్లో ఏప్రిల్ 26 వరకూ లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అలహాబాద్ కోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యోగి సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లాక్‌డౌన్ విధించే అంశం కోర్టు పరిధిలోకి రాదని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. యూపీలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ తీరు పట్ల అలహాబాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని.. పైగా కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు మండిపడింది. ఈ సందర్భంలోనే.. ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరక్‌పూర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటినీ మూసివేయాలని, లాక్‌డౌన్ పాటించాలని.. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఆదేశాలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తరపు అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్ స్పందిస్తూ.. కరోనా కట్టడికి ఆంక్షలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, అయితే బతుకుదెరువు కోల్పోకుండా చూడటం కూడా ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం ఆ నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అవసరం లేదని.. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారని హైకోర్టుకు వివరించారు.

    అయితే.. హైకోర్టు ఆ ఐదు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో కోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యోగి ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారించిన సుప్రీం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా.. యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లాక్‌డౌన్ విధిస్తూ న్యాయపరమైన ఆదేశాలివ్వడం సమంజసం కాదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



    ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి వచ్చే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అన్ని జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు శని, ఆదివారాల్లో వారాంతపు లాక్‌డౌన్ విధించనున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 208,523. ఇప్పటివరకూ యూపీలో 8,79,831 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా మరణాల సంఖ్య దాదాపు 10వేలకు చేరువైంది.
    Published by:Sambasiva Reddy
    First published: