SUPREME COURT REFUSES TO STAY 10 QUOTA FOR UPPER CASTE POOR BUT WILL EXAMINE VALIDITY MS
అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లపై 'స్టే' ఇవ్వడం కుదరదన్న సుప్రీం..
సుప్రీం కోర్టు
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల స్టంట్గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ఎన్నికలకు ముందు దీన్ని తెర పైకి తీసుకురావడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలన్న కేంద్రం నిర్ణయంపై 'స్టే' ఇవ్వడం కుదరదని సుప్రీం ధర్మాసం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే కేంద్రం అమలుచేయబోతున్న ఆ పాలసీని మాత్రం పరిశీలిస్తామని తెలిపింది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ కన్నాలతో కూడిన సుప్రీం బెంచ్ ఇలా స్పందించింది.
అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీ కింద 10శాతం రిజర్వేషన్ కల్పించడానికి కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పాలసీ కింద కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ సుప్రీం జోక్యం చేసుకోబోదని బెంచ్ స్పష్టం చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం.. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విఘాతం కలిగించేదిగా ఉందని దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు చెబుతున్నాయి. రిజర్వేషన్లకు సామాజిక నేపథ్యాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా ఆర్థిక నేపథ్యాన్ని ప్రాతిపదికగా తీసుకోవడాన్ని పిటిషనర్స్ తప్పు పడుతున్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల స్టంట్గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ఎన్నికలకు ముందు దీన్ని తెర పైకి తీసుకురావడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ పాలసీ ఇప్పటికే ఉభయ సభల్లో ఆమోదం కూడా పొందిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.