హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Snake Bite: పాములతో కరిపించడం కొత్త ట్రెండ్ అయిపోయింది.. బెయిల్ ఇచ్చేదే లేదు: సుప్రీం

Snake Bite: పాములతో కరిపించడం కొత్త ట్రెండ్ అయిపోయింది.. బెయిల్ ఇచ్చేదే లేదు: సుప్రీం

సుబోధ్ దేవి, అల్పన (ఫైల్ ఫొటో)

సుబోధ్ దేవి, అల్పన (ఫైల్ ఫొటో)

సుప్రీం కోర్టు విచారణకు బుధవారం నాడు ఓ ఆసక్తికర పిటిషన్ వచ్చింది. అత్తను పాముతో కరిపించి చంపిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోడలి స్నేహితుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

ఇంకా చదవండి ...

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు విచారణకు బుధవారం నాడు ఓ ఆసక్తికర పిటిషన్ వచ్చింది. అత్తను పాముతో కరిపించి చంపిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోడలికి సహకరించిన నిందితుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అంతేకాదు.. పాముల పట్టుకునే వాళ్ల దగ్గర నుంచి పాములను తీసుకుని వాటితో మనుషుల్ని కరిపించి చంపించడం కొత్త ట్రెండ్ అయిపోయిందని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజస్థాన్‌లో ఈ తరహా హత్యలు సర్వ సాధారణమయిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ కేసులో నిందితుడైన కృష్ణ కుమార్ తరపున కేసు వాదించిన అడ్వకేట్ ఆదిత్య చౌదరి వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆదిత్య చౌదరి నిందితుడి తరపున వాదిస్తూ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన క్లయింట్ ఈ హత్యకు సహకరించినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు ఏవీ లేవని చెప్పారు. తన స్నేహితురాలు పామును కొనమని చెబితే పాములు పట్టుకునే వాళ్ల దగ్గరకు వెళ్లి రూ.10,000లకు కొన్నమాట వాస్తవమేనని.. అయితే.. ఆమె పామును ఎందుకు కొనమని చెప్పిందో తన క్లయింట్‌కు తెలియదని వాదించారు.

తన క్లయింట్ ఆమెను అడిగిన సందర్భంలో.. వైద్యం కోసం కావాలని ఆమె చెప్పేసరికి కొన్నాడని చెప్పారు. అంతేకాకుండా.. ఆ పాముతో నేరుగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న వివాహిత ఇంటికి తన క్లయింట్ వెళ్లలేదని వాదించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన క్లయింట్ ఇంజనీరింగ్ విద్యార్థి అని, అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా అడ్వకెట్ ఆదిత్య చౌదరి కోర్టును కోరారు. అయితే.. సుప్రీం నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఇక.. ఈ కేసు పూర్వాపరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. 2019లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

రాజస్థాన్‌లోని జుంజున్ జిల్లాలోని ఓ గ్రామంలో అత్తను ఆమె కోడలు పాముతో కరిపించి హత్య చేసిన ఘటన ఆ సమయంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్పన అనే యువతికి 2018, డిసెంబర్ 12న సచిన్ అనే యువకుడితో పెళ్లైంది. అల్పన భర్త, ఆమె మరిది ఆర్మీలో పనిచేసేవారు. దీంతో.. ఆమె తన అత్త సుబోధ్ దేవితో కలిసి ఉండేది. సుబోధ్ దేవి భర్త కూడా ఉద్యోగ నిమిత్తం కుటుంబానికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో కేవలం అత్తాకోడలు మాత్రమే ఉండేవారు. ఇలా ఉంటున్న కొన్ని నెలలకు అల్పన జైపూర్‌కు చెందిన మనీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఫోన్‌లో గంటలుగంటలు మాట్లాడుకునేవారు.

సుబోధ్ దేవికి కొన్ని రోజులకు కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెపై నిఘా పెట్టగా.. తన కోడలు అల్పన మనీష్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని దేవికి తెలిసింది. దీంతో.. కోడలిపై శ్రద్ధ పెట్టి ఫోన్ కాల్స్‌‌పై, అఫైర్‌పై అత్త నిలదీసింది. తన ప్రియుడితో కలిసేందుకు అత్త అడ్డంకిగా మారిందని భావించిన అల్పన ప్రియుడు మనీష్‌తో కలిసి అత్త హత్యకు ప్లాన్ చేసింది. అయితే.. తమ చేతులకు మట్టి అంటకుండా ఆమె అడ్డు తొలగించుకోవానుకుంది. అందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. పామును అత్త ఉంటున్న గదిలోకి వదిలితే ఆ పాము కాటుకు ఆమె చనిపోతుందని.. పాము కరిచి చనిపోయిందని ప్రచారం చేసి కేసు నుంచి బయట పడొచ్చని భావించింది. మనీష్‌కు పామును కొనుక్కుని రమ్మని చెప్పింది. అనుకున్నట్టుగానే ఆమె అత్త గదిలోకి పామును వదిలారు. ఆ పామ కాటు వేయడంతో సుబోధ్ దేవి ప్రాణాలు కోల్పోయింది. 2019 జూన్ 2న పాము కాటు కారణంగా సుబోధ్ దేవి చనిపోయింది.

ఇది కూడా చదవండి: Very Sad: అయ్యయ్యో.. భగవంతుడా.. ఎంత ఘోరం జరిగింది.. గాల్లో కలిసిన ఏడు నిండు ప్రాణాలు..

నెలన్నర తర్వాత అల్పనపై సుబోధ్ దేవి కుటుంబానికి అనుమానమొచ్చి ఫిర్యాదు చేశారు. అల్పన, మనీష్ అఫైర్ గురించి కూడా తెలుసుకుని వాళ్లిద్దరి కాల్ డేటాను చెక్ చేయాలని పోలీసులు వాళ్ల నంబర్లను ఇచ్చారు. పోలీసులు అల్పన, మనీష్ కాల్ డేటాను పరిశీలించగా జూన్ 2న.. అంటే సుబోధ్ దేవి పాము కాటుకు గురైన రోజున ఇద్దరి మధ్య 124 కాల్స్ నడిచాయి. అల్పన, కృష్ణకుమార్ మధ్య కూడా 19 కాల్ సంభాషణలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్ని మెసేజ్‌లు కూడా ఈ ముగ్గురి మధ్య షేర్ అయినట్లు గుర్తించారు. సుబోధ్ దేవి హత్యలో అల్పన, మనీష్, అతని స్నేహితుడు కృష్ణ కుమార్ పాత్ర ఉందని నిర్ధారించుకున్న పోలీసులు జనవరి 4, 2020న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ జైలులోనే ఉన్నారు. కృష్ణకుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఘటన మరోసారి తెరపైకొచ్చింది.

First published:

Tags: Crime news, Extra marital affair, Murder, Rajasthan, Snake bite, Supreme Court

ఉత్తమ కథలు