భారతదేశంలో సంచలనం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు (supreme court) 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. సీనియర్ న్యాయవాది, గే అయిన సౌరభ్ కృపాల్ (Saurabh kripal)ను ఢిల్లీ హైకోర్టు (Delhi high court) న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఒకవేళ కొలీజియం (collegium) సిఫార్సును కేంద్ర ప్రభుత్వం (Union government) ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ రికార్డులకెక్కనున్నారు. ఈనెల 11న జరిగిన సమావేశంలో సౌరభ్‌కు పదోన్నతి కల్పించే సిఫార్సును జస్టిస్ రమణ (Justice ramana), జస్టిస్ లలిత్ (Justice Lalit), జస్టిస్ ఖాన్విల్కర్ (justice khanwilkar) ల బృందంతో కూడిన కొలీజియం ఆమోదించింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జ్యుడిషియల్ ఆఫీసర్ బిఎస్ భానుమతి మరియు న్యాయవాది కె మన్మధరావుల పదోన్నతి ప్రతిపాదనను కొలీజియం ఆమోదించింది.
మూడు సార్లు సిఫార్సు..
మాజీ సీజేఐ భూపీందర్‌నాథ్ కృపాల్ కుమారుడైన సౌరభ్ కృపాల్ (Saurabh kripal) పేరును న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017లోనే సిఫార్సు చేసింది. అక్టోబరు 13, 2017న ఢిల్లీ హైకోర్టు కొలీజియం కృపాల్ పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది. ఆయన ఫైల్ జూలై 2, 2018న సుప్రీం కోర్టు కొలీజియంకు చేరింది. అయితే అతడి స్వలింగ సంపర్క నేపథ్యంలో 2018, 2019లో మూడుసార్లు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైనప్పటికీ దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయంపై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Supreme court chief justice)గా ఉన్న జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. స్విస్ విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తితో సౌరభ్ సహజీవనం చేస్తుండటంతో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతోంది. అదేవిధంగా కృపాల్ జాతీయతతో పాటు అతడి భాగస్వామి యూరోపియన్ అయినందున ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతోంది.
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదివిన ఘనత..
సౌరభ్(Saurabh kripal) విషయానికొస్తే ఢిల్లీలోని సెయింట్-స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. ఆక్స్ ఫర్డ్ (Oxford University), కేంబ్రిడ్జి (Cambridge University) లాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో న్యాయ శాస్త్రం చదివి ఘనత దక్కించుకున్నారు. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకు పైగా లాయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా గే హక్కుల కోసం సుప్రీంలో పోరాడి విజయం సాధించారు. సౌరభ్ తండ్రి భూపీందర్‌నాథ్ కృపాల్ 2002 మే నుంచి నవంబరు మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
ఇతర హైకోర్టులకూ..
అంతేకాకుండా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా అనన్య బందోపాధ్యాయ, రాయ్ చటోపాధ్యాయ మరియు శుభేందు సమంతా అనే ముగ్గురు జ్యుడీషియల్ అధికారులను పదోన్నతి కల్పించాలనే దాని సిఫార్సులను కూడా కొలీజియం చేసింది. కేరళ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు శోబా అన్నమ్మ ఈపెన్, సంజీత కల్లూరు అరక్కల్, అరవింద కుమార్ బాబు తవరక్కత్తిల్‌ల పేర్లను, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సచిన్ సింగ్ రాజ్‌పుత్ పేర్లను సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Delhi High Court, NV Ramana, Supreme Court