హోమ్ /వార్తలు /జాతీయం /

జమ్మూకాశ్మీర్‌లో సైనికులకు రక్షణ ఏది? సమాధానం కోరుతూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

జమ్మూకాశ్మీర్‌లో సైనికులకు రక్షణ ఏది? సమాధానం కోరుతూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pulwama Attack Update : భారత్, పాకిస్థాన్ సరిహద్దుల వెంట యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ... జమ్మూకాశ్మీర్‌లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది కేంద్రం. మరి వారికి రక్షణ ఉందా?

  పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు చనిపోయిన తర్వాత... జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా... మరో డీఎస్పీ అమరుడయ్యారు. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రోజూ చొరబాట్లతో ఉగ్రమూకలు దేశంలోకి రావడం, వారితో సైనికులు పోరాడటం, ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవడం. వీటికి తోడు కాశ్మీర్‌లో అంతర్గత కల్లోలం మరో సమస్య. సైనికులపైనే రాళ్లు రువ్వుతూ యువత... ఆందోళనకర పరిస్థితులకు ఆజ్యం పోస్తోంది. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపింది. ఆర్మీ అధికారులకు చెందిన ఇద్దరు పిల్లలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జమ్మూకాశ్మీర్‌లో మోహరించే సైన్యానికి సెక్యూరిటీ కల్పించాలని వారు కోరారు. చట్టం ప్రకారం సైనికులకు మానవ హక్కులున్నాయి. వాటిని పరిరక్షించే బాధ్యత కేంద్రానిదే. దీనిపై స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది.
  జమ్మూకాశ్మీర్-శ్రీనగర్-ఉరి నేషనల్ హైవే 370 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 175 కిలోమీటర్లు కాశ్మీర్ లోయలో ఉంటుంది. ఈ మార్గంలో ఎక్కడా కూడా సైన్యానికి రక్షణ అంటూ లేదు. ఇక్కడి అనంతనాగ్, పుల్వామా, శ్రీనగర్, బారాముల్లాలో ఉగ్రవాదుల చొరబాట్లు, కాల్పులు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్‌గా జమ్మూకాశ్మీర్‌లో, సరిహద్దల వెంట వేల మంది సైన్యాన్ని మోహరిస్తోంది. నిరంతరం గస్తీగాయడం సైన్యం వల్ల కూడా కాదు. వాళ్లూ మనుషులే కదా. అందువల్ల సైన్యం ఏమరుపాటుగా ఉన్న క్షణాల్లో ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. తమ ప్రాణాల్ని పణంగా పెడుతూ దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


  సైన్యంపై రాళ్ల దాడులేంటి? : జమ్మూకాశ్మీర్‌లో యువతకు సైన్యంపై ఏమాత్రం సదభిప్రాయం లేదు. మాట్లాడితే సైన్యంపైనే రాళ్లు రువ్వుతారు. ఇలాంటి చాలా సందర్భాల్లో సైనికులు గాయాలపాలవుతున్నారు. నిజంగా ఆర్మీ తలచుకుంటే... అక్కడి యూత్‌ని అణచివెయ్యడం క్షణాల్లో పని. అలా చేస్తే ఆందోళనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు వేర్పాటు వాదులు స్థానికులను మరింత రెచ్చగొట్టేందుకు వీలు దొరుకుతుంది. అందుకే సైన్యం భాష్ప వాయువులు, రబ్బరు బుల్లెట్లతోనే పని కానిస్తోంది. అందువల్ల సైన్యానికి సరైన రక్షణ లేకుండా పోతోంది.
  జమ్మూలోని కుల్గాంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ అమన్ థాకూర్‌కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విధి నిర్వహణలో దేశానికి ఆయన చేసిన సేవల్ని అందరూ గుర్తుచేసుకున్నారు.


  ప్రస్తుతం రెండు దేశాలూ సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాల్నీ మోహరించాయి. రెండు దేశాల ప్రభుత్వాలూ యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేకపోయినా... ఏ క్షణాన ఏమైనా జరగొచ్చన్న ఉద్దేశంతో అప్రమత్తతలో భాగంగా సెక్యూరిటీని పెంచుకుంటున్నట్లు తెలిసింది.


   

  ఇవి కూడా చదవండి :


  దాహం వేస్తోందా... సబ్జా గింజలు తాగితే చాలు... ఎంతో ఆరోగ్యం కూడా...


  కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే


  పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...


  పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

  First published:

  Tags: Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Supreme Court

  ఉత్తమ కథలు