మూడు దశాబ్దాల నుంచి న్యాయస్థానాల్లో నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం వివాదం కేసులో సుప్రీం తుది తీర్పు వెల్లడించింది. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ తీర్పుపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. మొత్తం ఐదు ఎన్వలప్స్‌లో తీర్పు కాపీలను పొందుపరచగా.. దాని సారాంశాన్ని జస్టిస్ రంజన్ గొగొయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు.వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయానని సుప్రీం తెలిపింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లా విరాజ్‌మన్,నిర్మోహి అఖారా,సున్నీ వక్ఫ్ బోర్డులకు పంచుతూ గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుపట్టింది.
మొదట సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు సుప్రీం ప్రకటించింది.అలాగే నిర్మోహి అఖాడా అప్పీల్‌ను కూడా కొట్టివేసింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తున్నట్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఇందుకోసం కేంద్రం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిర్మోహి అఖాడాకు కూడా ట్రస్టులో భాగస్వామ్యం కల్పించాలని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.