Lakhimpur హింసాకాండ: నిందితుల్ని అరెస్టు చేశారా? స్టేటర్ రిపోర్టు ఇవ్వండి -యోగి సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

లఖీంపూర్ హింసపై సుప్రీం విచారణ

SC Asks UP To File Report on Lakhimpur Kheri Violence :సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తోన్న రైతులను బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కారుతో తొక్కి చంపిన ఘటనపై నిరసనలు ఇంకా కొనాసగుతున్నాయి. ఘటన జరిగి ఐదు రోజులైనా, ఎఫ్ఐఆర్ లో మంత్రి కొడుకును నిందితుడిగా పేర్కొన్నా ఇప్పటికీ అరెస్టులు జరక్కపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అరెస్టులతోపాటు కేంద్ర మంత్రి, యూపీ మంత్రుల రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా ఇవే ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం కూడా యూపీ సర్కారుకు సంధించింది..

  • Share this:
లఖీంపూర్ ఖేరి ఘటనపై సమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటి ప్రశ్నలు అడిగింది. హింసాకాండను దురదృష్టకర ఘటనగా పేర్కొంటూ, కేసు పూర్వాపరాలు, నిందితుల అరెస్టులు, విచారణ ఎంత వరకు వచ్చిందనే వివరాలను కోర్టు అడిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నాడు ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది..

‘నలుగురు రైతులు, జర్నలిస్టులు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయిన దురదృష్టకరమైన సంఘటన ఇది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏం దర్యాప్తు చేశారు? ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు? లాంటి వివరాలతో కూడిన సమగ్ర రిపోర్టును 24 గంటల్లోగా కోర్టు ముందు ఉంచండి..’అని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే,

రైతులపై మారణకాండ ఘటనను సుప్రీంకోర్టు విచారించడానికి కొద్ది గంటల ముందే యోగి సర్కారు తెలివిగా సదరు ఘటనపై ఎంక్వైరీ కమిషన్ ను ప్రకటించింది. హింసాకాండలో 8 మంది మరణించిన ఘటనపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ యూపీ గవర్నర్ గురువారం గెజిట్ జారీ చేశారు. ఈ ఏకసభ్య కమిషన్ రెండు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు.

ఏకసభ్య కమిషన్ తోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను కూడా యూపీ సర్కారు నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్, కమిషన్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతున్నందున వివరాల వెల్లడికి సమయం పట్టొచ్చని యూపీ పోలీసులు అభ్యర్థించే పక్షంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఈ నెల 3వతేదీన లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతులు, బీజేపీ శ్రేణులకు మధ్య జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 8మంది మరణించారు. రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్నారు.
Published by:Madhu Kota
First published: