ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే న్యాయం రూపురేఖలు మారిపోతాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. జోధ్‌పూర్‌లో ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చీఫ్ జస్టిస్ బాబ్డే..‘న్యాయం అనేది సత్వరంగా ఉండకూడదు. న్యాయం అనేది ప్రతీకారంగా మారితే, న్యాయం రూపు మారిపోతుంది.’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ రకమైన డిమాండ్ నెలకొంది. రేప్ చేసిన వారు అందరనీ ఇలాగే ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రాజస్థాన్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి చీఫ్ జస్టిస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా వచ్చారు. రేప్ కేసుల్లో సత్వరన్యాయం జరిగేలా చూడాలని రవిశంకర్ ప్రసాద్ సీజేఐను కోరారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి వీలైనంత త్వరగా న్యాయం చేయగలగాలి. ఆ న్యాయం ఆమోదయోగ్యంగా ఉండాలి.’అని చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు. కొత్త కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధానం పెరగాలన్నారు.
గతంలో పలువురు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాబ్డే అది ‘మనల్ని మనం సరిచేసుకోవడం’గా అభివర్ణించారు. కేసుల్లో వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడడమే కాదు.. అసలు నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ పిటిషన్లలో కోరారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.