హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Paddy straw: రైతులకు శుభవార్త.. వరిగడ్డితో ఇథనాల్ తయారీ.. మీరు కూడా అమ్మొచ్చు.. క్వింటాల్‌కు ఎంతంటే..

Paddy straw: రైతులకు శుభవార్త.. వరిగడ్డితో ఇథనాల్ తయారీ.. మీరు కూడా అమ్మొచ్చు.. క్వింటాల్‌కు ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వరి గడ్డిని సేకరిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించడంతో.. ఇకపై రైతులు పంటలు పూర్తయ్యాక.. గడ్డిని తగులబెట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా వాతావరణ కాలుష్యం జరగదు. గడ్డి అమ్మకంతో అదనపు ఆదాయం కూడా వస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  శీతాకాలంలో ఢిల్లీ  (New Delhi) ఎన్సీఆర్‌తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. పంజాబ్ (Punjab), హర్యానా (Haryana), యూపీ (Uttar Pradesh)లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కాలుష్య తీవ్రత ఎక్కువవుతోంది. ఏటా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ప్రత్యేక చొరవ చూపుతోంది. అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా కీలక ప్రకటన చేసింది. రైతుల నుంచి గడ్డిని సేకరిస్తామని తెలిపింది. పంటల కోత పూర్తయ్యాక.. వ్యర్థంగా మిగిలే వరిగడ్డి(Paddy straw)ని రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఆ గడ్డితో హర్యాణా పానిపట్‌లోని తమ రిఫైనరీలో ఇథనాల్‌ (Ethanol)ను ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.

  పానిపట్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) రిఫైనరీలో గడ్డితో ఇథనాల్ తయారుచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. రూ.900 కోట్లతో నిర్మించిన ఈ ఇథనాల్‌ ప్లాంట్‌లో రోజుకు 100 కిలో లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని తయారీకి పెద్ద మొత్తంలో గడ్డి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గడ్డిని చుట్టు పక్కల జిల్లాల నుంచి సేకరిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇందుకోసం చుట్టుపక్కల జిల్లాల్లో గడ్డి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర, గోధుమ గడ్డిని చక్కగా కట్టలుగా కట్టాలి. అలాంటి వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతుల నుంచి వరి గడ్డిని క్వింటాల్‌కు రూ.172 చొప్పున చెల్లిస్తారు. ఇలా ఒక ఎకరం పొలం నుంచి రూ.3000 వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.

  హర్యాణాలోని పానిపట్, కర్నాల్, కురుక్షేత్ర, కైతాల్ జిల్లాలతో పాటు పంజాబ్ , యూపీ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు వరి, గోధుమను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వరి పంట పూర్తయ్యాక పెద్ద మొత్తంలో గడ్డి పోగవుతోంది. ఆ గడ్డిని రైతులు అక్కడే తగులబెట్టడంతో.. ప్రతి ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం జరుగుతుంది. ఆ ప్రభావం ఢిల్లీపైనా పడుతుంది. ఐతే వరి గడ్డిని సేకరిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించడంతో.. ఇకపై రైతులు పంటలు పూర్తయ్యాక.. గడ్డిని తగులబెట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా వాతావరణ కాలుష్యం జరగదు. గడ్డి అమ్మకంతో అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఈ అవకాశాన్ని రైతులంతా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Haryana

  ఉత్తమ కథలు