Steve Jobs: స్టీవ్ జాబ్స్ మొదటి ఉద్యోగ దరఖాస్తు ఫారమ్ వేలం.. అందులో స్పెషల్ ఏంటంటే..

steve jobs

రీడ్ కాలేజీ నుంచి బయటకొచ్చిన స్టీవ్ జాబ్స్.. తన చదువును మధ్యలోనే మానేశారు. అనంతరం ఒక జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఫాంను స్టీవ్ జాబ్స్ సొంతంగా నింపారు. తన వ్యక్తిగత వివరాలతో సహా విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాల గురించి దరఖాస్తులో రాసుకున్నారు. అయితే 1973లో స్టీవ్ జాబ్స్ తన స్వహస్తాలతో రాసిన ఈ ఉద్యోగ దరఖాస్తు ఇప్పుడు వేలానికి వచ్చింది.

  • Share this:
యాపిల్‌ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక పండు పేరుని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ నేమ్‌గా మార్చిన ఘనత స్టీవ్‌ జాబ్స్‌కే దక్కుతుంది. ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. డబ్బులేక రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి.. గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన జర్నీ స్ఫూర్తిగా ఉంటుంది. ఒకప్పుడు ఆయన సాధారణ యువకుల్లాగే జాబ్స్ కోసం ప్రయత్నించేవారు. రీడ్ కాలేజీ నుంచి బయటకొచ్చిన స్టీవ్ జాబ్స్.. తన చదువును మధ్యలోనే మానేశారు. అనంతరం ఒక జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఫాంను స్టీవ్ జాబ్స్ సొంతంగా నింపారు. తన వ్యక్తిగత వివరాలతో సహా విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాల గురించి దరఖాస్తులో రాసుకున్నారు. అయితే 1973లో స్టీవ్ జాబ్స్ తన స్వహస్తాలతో రాసిన ఈ ఉద్యోగ దరఖాస్తు ఇప్పుడు వేలానికి వచ్చింది. ఈ జాబ్ అప్లికేషన్‌ను ‘నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్‌’ (ఒక రకమైన డిజిటల్‌ ఆస్తి) గా వేలం వేయనున్నారు.

అలాగే ఒరిజినల్ ఫిజికల్ దరఖాస్తును కూడా వేలం వేయనున్నారు. మొట్టమొదటి డిజిటల్ వెర్షన్, అసలైన అప్లికేషన్‌ ఫాంను ఒకేసారి వేలం వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేనికి ఎక్కువ రేటు పలుకుతుందో తెలుస్తుందని భావిస్తున్నారు. https://stevejobsjobapplication.com/ వెబ్‌సైట్ లో రెండు పత్రాలను వేలానికి తీసుకొచ్చారు. కాగా, లండన్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఆలీ జోషి వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ వెబ్‌సైట్ ప్రకారం, స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన వేలం 5 రోజుల్లో ముగుస్తుందని తెలుస్తోంది. జూలై 28 తేదీలోపు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది మార్చి నెలలో చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018 సంవత్సరంలో ఒక వేలంపాటలో సుమారు రూ.1.2 కోట్లుకు విక్రయించబడింది. ఇకపోతే స్టీవ్ జాబ్స్ ఏ ఉద్యోగానికి అప్లై చేశారనే విషయం ఈ అప్లికేషన్‌లో లేదు. ఉద్యోగం కోసం అప్లై చేసిన ఒక సంవత్సరం తర్వాత స్టీవ్ జాబ్స్ వీడియో గేమ్స్ డెవలప్ చేసే అటారీ అనే సంస్థలో టెక్నీషియన్‌గా జాయిన్ అయ్యారు. నైట్ షిఫ్ట్ టెక్నీషియన్‌గా ఆయన పని చేసేవారు. అదే సంస్థలో స్వీవ్ వోజ్నియాకీ కూడా పనిచేసేవారు. అయితే వీరిద్దరూ కలసి 1976లో యాపిల్‌ సంస్థను స్థాపించారు.
Published by:Veera Babu
First published: