అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న యోగి ఆదిత్యనాథ్ పరిపాలనపై మరింత పట్టుబిగించారు. పొదుపు చర్యల్లో భాగంగా మంత్రులు, ఉన్నతాధికారులకు స్టార్ హౌటల్ సౌకర్యాలను తొలగించారు. మంత్రులు తమ బంధువులను పీఏలుగా పెట్టుకోవడం కుదరదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆఫీసులో చాయ్, లంచ్ కబుర్లకు స్వస్తిపలకాలని హెచ్చరించారు. విధుల నిర్వహణ, అధికారిక పర్యటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన క్యాబినెట్ మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు కఠిన మార్గదర్శకాలు నిర్దేశించారు. అధికారులు, మంత్రులతో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
యూపీలో మంత్రులు ఇకపై వివిధ ప్రాంతాల్లో అధికార పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల్లో బస చేయాలే తప్ప హోటళ్లకు వెళ్లకూడదని సీఎం యోగి తేల్చి చెప్పారు. మంత్రులు తమ బంధువులను పర్సనల్ సెక్రటరీలుగా నియమించుకోవద్దని సూచించారు. గెస్ట్ హౌస్‌ల్లోనే బస చేయాలన్న ఆదేశాలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణపైనా సీఎం యోగి కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు సరైన సమయానికి విధులకు హాజరుకావాలని, భోజన సమయం 30 నిమిషాలకు మించకూడదని ఆదేశించారు. ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రతి ఆఫీసులోనూ సిటిజన్ చార్టర్ అమలు చేయాలని చెప్పారు.
తాను చెప్పినవన్నీ మంత్రులు, అధికారులు విధిగా పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది, అధికారులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఫైల్ కూడా మూడు రోజులకు మించి పెండింగ్‌లో ఉండరాదని స్పష్టం చేశారు. సీఎం కఠిన నిర్ణయాలపై మంత్రులు, అధికారులు గుబులు పడుతుండగా, సామాన్యులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Uttar pradesh, Yogi adityanath