షిఫ్టుకి 8 గంటలకు మించి పనిచెయ్యాలా?... కేంద్రం ఆలోచన ఇదీ...

షిఫ్టుకి 8 గంటలకు మించి పనిచెయ్యాలా?... కేంద్రం ఆలోచన ఇదీ... (credit - twitter)

ఉద్యోగులు తమ షిఫ్టులో ఎన్ని గంటలు పనిచెయ్యాలి అనే అంశంపై రకరకాల వాదనలు ఉన్నాయి. మరి కేంద్రం అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.

 • Share this:
  భారత్‌లో కరోనా వచ్చాక... ఉద్యోగుల పని గంటలను పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దాదాపు 9 రాష్ట్రాలు పని గంటలను 8 గంటల నుంచి 12 గంటల వరకూ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఎప్పుడైతే ఇలా కోరాయో... ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగులు భగ్గుమన్నారు. కన్నెర్ర జేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. అంతే... ఆ రాష్ట్రాలన్నీ తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఎప్పట్లాగే 8 గంటలే బెటర్ అనేశాయి. ప్రజలు ఇంతలా కన్నెర్ర జేయడానికి కారణం ఏంటంటే... పని గంటలు పెంచినా... ఓవర్‌టైమ్ చేసినందుకు ఏమీ ఇచ్చేది లేదని ఆ రాష్ట్రాలు మొదట అన్నాయి. కార్మిక చట్టాల్లో సవరణలు చేసేస్తే సరిపోతుంది అన్నాయి. పాలకులు అలా అంటే ప్రజలు ఊరుకుంటారా... ప్రతాపం చూపించారు. ఇప్పుడు తాజాగా కేంద్రం... పార్లమెంటరీ ప్యానెల్‌కి సోమవారం తన అభిప్రాయం చెప్పింది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పని చేయించడం రాష్ట్రాల వల్ల కాదని చెప్పేసింది.

  కార్మికులకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటుంది. దానికి బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్... చైర్ పర్సన్. ఆ కమిటీ ముందు కేంద్ర కార్మిక, ఉద్యోగాల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వలస కార్మికులు కొన్ని రాష్ట్రాలను వదిలి... సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో... ఆ రాష్ట్రాల్లో కార్మికుల కొరత వచ్చిందనీ... అందుకే పని గంటలను పెంచాలని ఆ రాష్ట్రాలు కోరాయనీ... ఆ తర్వాత మళ్లీ తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నాయని వారు తెలిపారు. కార్మిక చట్టాల్ని ఎందుకు సవరించాలో చెప్పాలంటూ... పార్లమెంటరీ ప్యానెల్... కొన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.

  అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఉంది కదా... మన భారతదేశం... ఆ సంస్థ అజమాయిషీలో... కార్మిక చట్టాలు చేసింది. కాబట్టి ఇప్పుడు ఎడాపెడా చట్టాల్ని సవరించేస్తామంటే ILO ఊరుకోదు. ILO ప్రకారం... ఏ ఉద్యోగి అయినా రోజుకు 8 గంటలే పనిచెయ్యాలి. జీతం కూడా ఆ 8 గంటలకే ఇస్తారు. ILOని ఒప్పించి పని గంటలు పెంచాల్సి వస్తే... అప్పుడు ఓవర్ టైమ్ పనికి కూడా శాలరీ చెల్లించేలా చేస్తామనీ... అలాగే... కాంపెన్సేటరీ లీవ్స్ కూడా ఇస్తామని ప్యానెల్ ముందు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తంగా మనకు అర్థమయ్యేది ఒకటే. ఇప్పుడు ఉన్నట్లే రోజుకు 8 పనిగంటలే ఉంటాయి. వాటిని పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదని అర్థమవుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: