news18-telugu
Updated: January 29, 2020, 5:58 PM IST
స్పైస్ జెట్
ముంబై-లక్నో ఇండిగో విమానంలో సహ ప్రయాణీకుడైన ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కమెడియన్ కునాల్ కమ్రాపై పలు విమాన సంస్థలు నిషేధం విదిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో సంస్థ కునాల్‌పై ఆరు మాసాల నిషేధం విదించగా...ఎయిరిండియా తదుపరి ఆదేశాలిచ్చే వరకు నిషేధం ఉంటుందని స్పష్టంచేసింది. తాజాగా స్పైస్ జెట్ కూడా తమ విమానాల్లో కునాల్ ప్రయాణించకుండా నిషేధం విదించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అతనిపై నిషేధం ఉంటుందని స్పైస్ జెట్ ట్విట్టర్లో వెల్లడించింది. దీనిపై స్పందించిన కునాల్ కమ్రా...మోదీజీ నేను నడిచి వెళ్లొచ్చా...దానిపై కూడా నిషేధం విదిస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఇండిగో విమానంలో తాను ఎవరికీ ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించలేదని కునాల్ పేర్కొన్నారు. క్యాబిన్ సిబ్బంది సూచనలను తాను ఏ మాత్రం ఉల్లంఘించలేదన్నారు. సహ ప్రయాణీకుల భద్రతకు భంగం కలిగించేలా తాను ప్రవర్తించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే వినియోగించుకున్నట్లు చెప్పుకొచ్చారు. మూడు విమాన సంస్థలు తనపై తాత్కాలిక నిషేధం విదించాయని...జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఈగోను హర్ట్ చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
కాగా ఈ వ్యవహారంపై ట్విట్టర్లో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కునాల్‌పై విమాన సంస్థల తాత్కాలిక నిషేధాన్ని కొందరు తప్పుబడుతుండగా..మరికొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాగూర్‌కి ఓ న్యాయం...సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు మాసంలో స్పైస్ జెట్ విమానంలో సీటు మార్చేందుకు నిరాకరిస్తూ ప్రజ్ఞా రాద్ధాంతం చేయడంతో 45 నిమిషాల పాటు విమానం ఆలస్యమైందని..దీంతో సహ ప్రయాణీకులను ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ప్రజ్ఞా ఠాగూర్‌లా కునాల్ కమ్రా విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించలేదని, ఆయనపై నిషేధం విదించడం సరికాదంటున్నారు.
కాగా అర్నబ్ గోస్వామి ఛానల్‌కి చెందిన రిపోర్టర్ తనను విమానంలో ఇబ్బందిపెట్టిన వీడియోతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. కునాల్ చేసింది తప్పయితే అర్నబ్ టీవీ ఛానల్ రిపోర్టర్ చేసింది తప్పుకాదా? అని ప్రశ్నిస్తున్నారు.
Published by:
Janardhan V
First published:
January 29, 2020, 5:56 PM IST