లాక్డౌన్ 4 సడలింపుల్లో భాగంగా ప్రజా రవాణా పున:ప్రారంభమయింది. ఇప్పటికే అన్ని చోట్లా బస్సులు తిరుగుతున్నాయి. మే 25 నుంచి దేశీయ విమానాలు కూడా ఎగరనున్నాయి. ఇక రైళ్లు కూడా దశల వారీగా పట్టాలెక్కనున్నాయి. కర్నాటకలో ఎల్లుడి నుంచి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. మే 22 నుంచి కర్నాటక లోపలే నడిచే రెండు రైళ్లకు నైరుతి రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు-బెళగావి-బెంగళూరు ట్రై వీక్లీ సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-మైసూరు-బెంగళూరు (వారానికి 2 సార్లు) నడిచే స్పెషల్ రైలు రాకపోకలు సాగిస్తాయని నైరుతి రైల్వే సీపీఆర్వో తెలిపారు.
ఈ రైళ్లలో ప్రయాణించాలంటే రిజర్వేషన్ తప్పనిసరి. టికెట్లు రైల్వే స్టేషన్ కౌంటర్లలో ఇవ్వరు. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. రైల్వే నిబంధనలకు అనుగునంగా భౌతిక దూరం పాటించాలి.
బెంగళూరు-బెళగావి రైలు:
ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరు నుంచి ఉదయం 8 గంటలకు రైలు బయల్దేరి సాయంత్రం 3.25 నిముషాలకు బెళగావికి చేరుకుంటుందని తెలిపింది. మార్గ మధ్యలో యశ్వంత్పూర్, తుమకూరు, అర్సికెరె, బిరూర్, చిక్కజజూర్, దావణగెరె, హరిహర్, రాణి బెన్నూర్, హవేరి, హుబ్బలి, ధార్వాడ్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు నుంచి సోమ, మంగళ, శుక్ర వారాల్లో.. బెళగావి నుంచి మంగళవారం, గురువారం, శని వారాల్లో రైలు రాకపోకలు సాగిస్తుంది.
బెంగళూరు-మైసూరు రైలు:
ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరు నుంచి ఉదయం 9.20 గంటలకు బయల్దేరి 12.45 గంటలకు మైసూరు చేరుకుంటుంది. మైసూరు నుంచి మధ్యాహ్నం 1.45 నిమిషాలకు బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బెంగళూరు చేరుతుంది. మధ్యలో కేంగేరి, రామనగరం, మద్దూర్, మాండ్య, పండవపుర, నగనహళ్లి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.