Gujarat AAP MLAs in touch with BJP : ఇటీవల జరిగిన గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి దిగి కేవలం 5 సీట్లను గెల్చుకున్న విషయం తెలిసిందే. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ సైతం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం పోల్ అయిన ఓట్లల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాటా 12.92 శాతం. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఛైతర్ వసావ, భూపత్ భయానీ, హేమంత్ ఖావా, ఉమేష్ మక్వాణా, సుధీర్ వాఘాని ఉన్నారు. అయితే ఆఫ్ తరపున గెలిచిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు.. భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఆప్ తరపున ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మొన్నటిదాకా బీజేపీకి ఎమ్మెల్యేలే. తమకు టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడిన వీరు ఆప్‌లో చేరి ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు వీరందరినీ బీజేపీలోకి తిరిగి తీసుకొచ్చేలా ఆప్ సంప్రదింపులు జరుపుతోంది.
ఇక ఆప్ తరపున జునాగఢ్ జిల్లాలోని విస్వదర్ నియోజకవర్గం నుంచి గెలిచిన భూపట్ భయాని తాను ఆప్ నుంచి వైదొలగి బీజేపీలో చేరనున్నట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. "నేను బీజేపీలో చేరలేదు.. నేను బీజేపీలో చేరాలా వద్దా అని నేను ప్రజలను అడుగుతాను" అని భయానీ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ అన్నారు. ప్రతిపక్షం తక్కువ సీట్లతో బలహీనంగా మారిందని, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష పీఠంపై కూర్చోవడం వల్ల తనకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమీ చేయలేను. నా సీటు రైతుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఉంది. వారి సాగునీటి సమస్యలను నేను పరిష్కరించాలి. ఈ ప్రాంతంలో చాలా మంది వ్యాపారులు కూడా ఉన్నారు. నేను వారి సమస్యలని కూడా చూసుకోవాలి. నాకు ప్రభుత్వంతో సత్సంబంధాలు లేకపోతే నేను అలా చేయలేను. ప్రభుత్వం సానుకూల స్పందన రాకముందే నా డిమాండ్లను ఉంచాను. నేను ఇప్పుడు ప్రజలను, నాయకులను సంప్రదిస్తాను. గుజరాత్ ప్రజలు నరేంద్ర మోదీకి, బీజేపీకి రికార్డు స్థాయిలో సీట్లు అందించారు. నేను దానిని గౌరవిస్తాను.. నేను ఇంతకుముందు బీజేపీలో ఉన్నాను,బీజేపీ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను"అని అన్నారు.
పాలు అమ్మినోడే పాలకుడు..హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్ సింగ్
గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఆప్ జాతీయ పార్టీ హోదాను సాధించిందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించగా తాజాగా గుజరాత్‌లో ఆప్ ఎమ్మెల్యేలు కాషాయ తీర్ధం పుచ్చుకోనుండటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇంకా ప్రమాణ స్వీకారాలు కూడా కాకుండానే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారనే కథనాలు గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ , మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గుజరాత్‌లో కొత్తగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతుండటం ఆ పార్టీ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Aravind Kejriwal, Bjp, Gujarat