news18-telugu
Updated: November 20, 2020, 2:36 PM IST
సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ అధ్యక్షురాలు ఢిల్లీని విడిచి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఢిల్లీ కాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె కొద్ది రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దీంతో ఆమె కొద్ది రోజుల పాటు చెన్నై లేదా గోవాకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రంలోపే ఆమె ఢిల్లీని వీడనున్నారని.. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలలో ఎవరో ఒకరు ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. కాగా, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటీ నుంచి సోనియా గాంధీ మందులు వాడుతూనే ఉన్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియా గాంధీ కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుకాకపోవడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
బిహార్ ఎన్నికల ఓటమిపై ఆత్మపరిశీలన కోసం పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో సోనియా గాంధీ ఢిల్లీని వీడి వెళుతున్నారు. ఈ డిమాండ్ చేస్తున్నవారిలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులను కోరుతూ ఆమెకు లేఖ రాసిన కొందరు నేతలు కూడా ఉన్నారు. ఇక, సోనియా గాంధీ జూలై 30వ తేదీ సాయంత్రం అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. ఆ పర్యటనలో ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఈ కారణంగా సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలను సోనియా, రాహుల్‌లు హాజరుకాలేదు.
ఇక, గతేడాది జనవరిలో సోనియా గాంధీ కొన్ని రోజుల పాటు గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె సైక్లింగ్ చేసిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Published by:
Sumanth Kanukula
First published:
November 20, 2020, 2:36 PM IST