పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు తేదీ ఈనెల 23 అయినా, ప్రస్తుతం రెండు సభల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా సభ ఏ క్షణంలోనైనా నిరవధిక వాయిదా పడే అవకాశాలుండటంతో మోదీ సర్కార్ స్పీడు పెంచింది. ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లుల్ని తీసుకొచ్చిన కేంద్రం.. నిన్న సోమవారం నాడు ‘ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం’ చేసే ఎన్నికల చట్టం సవరణ బిల్లును లోక్ సభలో ఆమోదింపజేసుకొని, మంగళవారం నాడే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ సీజన్ లో మరో ముఖ్యమైన బిల్లుగా భావిస్తోన్న ‘అమ్మాయిల పెళ్లి వయసు పెంపు’ బిల్లును సైతం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అమ్మాయిల పెళ్లి వయసును 21ఏళ్లకు పెంచడాన్ని తప్పుపడుతూ విపక్ష ఎంపీలు నిరసనలు చేస్తుండగా, ఆ గందరగోళంలోనే మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు..
అమ్మాయిల వివాహ కనీస వయసు ఇప్పటి దాకా 18 ఏళ్లుగా ఉండగా, దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రూపొందించిన బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు-2021ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మహిళలు.. పురుషులతో సమానంగా హక్కులు పొందే ప్రక్రియ 75 ఏళ్లు ఆలస్యమైందన్నారు.
‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వివాహ బంధంలోకి ప్రవేశించేందుకు స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కల్పన 75 ఏళ్లు ఆలస్యంగా జరుగుతోంది. 19వ శతాబ్దంలో ఆడపిల్లల వివాహ కనీస వయసు 10 సంవత్సరాలుగా ఉండేది. 80వ దశకంలోనూ బాలికలకు 15 ఏళ్లకే పెళ్లిళ్లు జరిగేవి. కానీ, తొలిసారి, స్త్రీ-పురుషులు ఒకే సమయంలో వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఈ చట్ట సవరణ సరికాదని వాదించే వారు ఒకసారి సుప్రీంకోర్టు తీర్పులను గుర్తుచేసుకోవాలి. ఈ చట్టం సెక్యులర్ అన్ని మతాలకు ఆమోదయోగ్యమైనదనే కోర్టు వ్యాఖ్యను మర్చిపోరాదు. అమ్మాయిల వివాహ వయసు పెంపు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడాన్ని గర్వంగా భావిస్తున్నాను..’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.