ఆ స్విమ్మింగ్ పూల్ కింద 303 కేజీల బంగారు కడ్డీలు..

IMA జ్యువెలర్స్ (File)

మన్సూర్ ఖాన్‌కి చెందిన రూ.300కోట్లు విలువ చేసే 23 ప్రాపర్టీస్‌ను ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ఈ స్కామ్‌కి సంబందించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రూ.209కోట్లు స్వాధీనం చేసుకుంది.ఇదే కేసుకు సంబంధించి సిట్ ఇప్పటివరకు 25మందిని అరెస్ట్ చేసింది.

 • Share this:
  బెంగళూరులోని ఓ భవంతిలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ కింద 303కేజీల బరువైన 5880 బంగారు కడ్డీలను సిట్ అధికారులు గుర్తించారు.అయితే అవి నకిలీవిగా నిర్దారించారు. ఐఎంఏ గ్రూప్ పోంజి స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సిట్ ‌బ‌ృందం బుధవారం ఆ సంస్థ యజమానికి చెందిన మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కి చెందిన ఓ భవంతిలో సోదాలు జరపగా.. ఈ కడ్డీలు బయటపడ్డాయి. ఈ నకిలీ కడ్డీలను చూపించే ఇన్వెస్టర్ల చేత మన్సూర్ ఖాన్ తన గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టించుకునేవాడని సిట్ అధికారులు తెలిపారు. దాదాపు 40వేల మంది నుంచి భారీగా పెట్టుబడులు స్వీకరించిన మన్సూర్ ఖాన్.. ఆ తర్వాత చేతులెత్తేసి దేశం విడిచి పారిపోయాడు.దీంతో అతని గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటున్నారు.

  రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున లంచాలు సమర్పించుకోవాల్సి రావడంతో.. తాను నష్టపోయానని.. ఆత్మహత్య చేసుకోవడమే ఇక మిగిలిందని గతంలో విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌లో మన్సూర్ ఖాన్ పేర్కొన్నాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు.పోలీసుల కథనం ప్రకారం అతను దుబాయి‌కి పారిపోయి.. అక్కడే కొన్నాళ్లు మకాం వేశాడు. ఇటీవలే అతన్ని దుబాయ్ నుంచి ఇండియా రప్పించిన సిట్ అధికారులు.. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.ఇక్కడి కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు మన్సూర్ ఖాన్‌ను ఒప్పించినట్లు సిట్‌ అధికారులు తెలిపారు.

  మన్సూర్ ఖాన్‌కి చెందిన రూ.300కోట్లు విలువ చేసే 23 ప్రాపర్టీస్‌ను ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ఈ స్కామ్‌కి సంబందించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రూ.209కోట్లు స్వాధీనం చేసుకుంది.ఇదే కేసుకు సంబంధించి సిట్ ఇప్పటివరకు 25మందిని అరెస్ట్ చేసింది.ఇందులో 12మంది సంస్థ డైరెక్టర్లు ఉన్నారు. బెంగళూరు మాజీ డిప్యూటీ కమిషనర్,ఓ కార్పోరేటర్ భర్త,బెంగళూరు నార్త్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషణ్ బేగ్‌‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయన్ను విచారణకు హాజరవాల్సిందిగా కోరగా.. బేగ్ కొంత గడువు కోరారు.కాగా, ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది.
  Published by:Srinivas Mittapalli
  First published: