దేశమంతటా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల సందడితో ఇంటింటా పండగ వైభవంగా జరిగింది. కానీ ఆ చెల్లి మాత్రం అశ్రు నయనాలతో రాఖీ వేడుకని జరుపుకుంది. అందరూ సోదరుడి చేతికి రాఖీ కడితే.. ఆమె మాత్రం అన్నయ్య వాడిన తుపాకీకి రాఖీ కట్టింది. రైఫిల్‌కు హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. ఎందుకంటే ఆమె అన్న గత ఏడాది చనిపోయాడు. మావోయిస్టుల తూటాలకు బలైపోయాడు. దేశం కోసం పోరాడి భరతమాత ముద్దుబిడ్డగా అమరవీరుడయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడకు చెందిన రాకేశ్ కౌశల్ అసిస్టెంట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. ఐతే గత అక్టోబరులో అరన్పూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. మావోయిస్టుల దాడిలో రాకేశ్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్, డీడీ కెమెరామన్ చనిపోయారు. అనంతరం రాకేశ్ కౌశల్ స్థానంలో అతడి చెల్లి కవిత్ కౌశల్‌కు కానిస్టేబుల్‌గా ఉద్యోగమిచ్చారు. ఆమె ఆఫీసు విధులు అప్పగించినప్పటికీ కోరిమరీ ఫీల్డ్ పోస్టింగ్ తెచ్చుకుంది. గతంలో రాకేశ్ పనిచేసిన ప్రాంతంలోనే కవిత డ్యూటీ చేస్తోంది.
అంతేకాదు తన అన్న వాడిన రైఫిల్నే ఆమెకు కేటాయించారు పోలీస్ అధికారులు. ఇక గురువారం రాఖీ సందర్భంగా రాకేశ్ వాడిన రైఫిల్‌కు రాఖీ కట్టింది కవిత. ప్రతి రాఖీ పండగకి తన అన్నయ్యకు రాఖీ కట్టేవాడని..కానీ ఈసారి అతడు లేకపోవడంతో రైఫిల్‌కు రాఖీ కట్టానని తెలిపింది. రాకేశ్ మృతికి కారణమైన మావోయిస్టులను వదలిపెట్టేబోనని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసింది కవిత. దంతేశ్వరి ఫైటర్స్‌లో చేరి తన అన్నయ్య మృతికి ప్రతీకారం తీర్చుకోడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించింది.