యూపీలోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్‌కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం, హత్య ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె సాయంత్రం బయటికి రాకుండా ఉండుంటే ఈ సంఘటన జరిగేది కాదు’ అంటూ సంకుచితంగా వ్యాఖ్యానించారు. ‘ప్రతిసారీ నేను స్త్రీలకు ఒకటే చెబుతున్నా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసర సమయాల్లో బయటకు వెళ్లకండి’’అని బాధిత మహిళా కుటుంబంతో చెప్పారు. బాధిత మహిళ ఆ సాయంత్రం బయటకు పోకుండా ఉన్నా, లేదా కుటుంబంలో ఒక చిన్నారిని తోడుగా తీసుకువెళ్లినా ఈ సంఘటన జరిగేది కాదన్నారు. అత్యాచార సంఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్ బట్టి తెలుస్తోందన్నారు.
చంద్రముఖి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళ అయి ఉండి, అది కూడా మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌లో బాధ్యాయుతమైన పదవిలో ఉండి.. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడమేంటని నెటిజెన్లు సహా అనేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం లేవడంతో ఆమెను పిలిచి మాట్లాడనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. అంతే కాకుండా మహిళలకు ఎక్కడైనా ఎప్పుడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని, దాన్ని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని రేఖా శర్మ పేర్కొన్నారు.
హథ్రాస్, బల్రామ్పూర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలు మరువక ముందే తాజాగా బదాయూలో మరో దారుణం జరిగింది. బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది. 3న ఆలయానికి వెళ్లిన ఓ అంగన్వాడీ మహిళ (50) పై పూజారితో పాటు ఇద్దరు అనుచరులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఘోరాన్ని అడ్డుకోవడానికి యత్నించిన ఆమెను నిందితులు కాలు, పక్కటెముకలను విరగొట్టారు. ఆమె జననావయవంలో రాడ్డు జొప్పించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దురాగతానికి పాల్పడిన దుర్మార్గుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Published by:Sridhar Reddy
First published:January 08, 2021, 18:26 IST