SHOP OWNER UNLEASHES PET DOGS ON POLICE OFFICERS FOR DEMANDING FINE FOR NOT WEARING MASK IN MAHARASHTRA SK GH
మాస్క్ లేకుంటే ఏమైంది? నాకే ఫైన్ వేస్తారా? పోలీసులపైకి కుక్కలను వదిలి పరుగులు పెట్టించాడు
ప్రతీకాత్మక చిత్రం
మాస్కులు ధరించనందుకు నిబంధనల ప్రకారం జరిమానా కట్టాలని అధికారులు ఆదేశించారు. నాకే ఫైన్ వేస్తారా? అని మున్సిపాలిటీ అధికారులతో గుప్తా వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా వారిపైకి తన పెంపుడు కుక్కను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు
మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతో రెండు వారాల క్రితం లాక్డౌన్ విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అక్కడి ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూస్తున్నారు పోలీసులు. అయితే ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుతో పోలీసులు విసిగిపోయారు. ఒక దుకాణం యజమాని ఆంక్షలకు విరుద్దంగా షాపును ఎక్కువ సమయం తెరిచి ఉంచాడు. పైగా అతడు కనీసం మాస్కు కూడా ధరించలేదు. దీనిపై నిలదీసిన పోలీసుల పైకి ఆ ప్రబుద్ధుడు తన పెంపుడు కుక్కను వదిలి దాడి చేయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో మంగళవారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దుకాణం యజమానిని అరెస్టు చేయడంతో పాటు ఘటనతో సంబంధం ఉన్నవారిపై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లా డొంబివాలికి చెందిన 43 ఏళ్ల సత్యనారయణ్ గుప్తా అనే వ్యక్తి స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం కర్ఫ్యూ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అతడు షాపును తెరిచి ఉంచాడు. ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన స్పెషల్ స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుంది. అప్పటికి గుప్తాతో పాటు దుకాణంలో పనిచేస్తున్న ఆనంద్, ఆదిత్య అనే ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించలేదని పోలీసులు గుర్తించారు. దీంతో మాస్కులు ధరించనందుకు నిబంధనల ప్రకారం జరిమానా కట్టాలని ముగ్గుర్నీ అధికారులు ఆదేశించారు. ఈ విషయంపై ప్రశ్నించిన పోలీసులు, మున్సిపాలిటీ అధికారులతో గుప్తా వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా వారిపైకి తన పెంపుడు కుక్కను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ దాడిలో స్పెషల్ స్క్వాడ్ బృందంలోని ఒక పోలీసు అధికారిని కుక్క కరవడం వల్ల గాయాలపాలయ్యారు. అనంతరం వివాదానికి కారణమైన షాపు యజమాని గుప్తాతో పాటు అక్కడ పనిచేస్తున్న ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి ఆదిత్య కోసం వెతుకుతున్నారు.
మహారాష్ట్రతో పాటు భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కోవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సేవలందిస్తున్న పోలీసులకు కొందరు కనీస గౌరవం సైతం ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులపై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం సైతం స్పందించింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. మహారాష్ట్రలో మే 1 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. అయితే కరోనా ఉద్ధృతి కారణంగా ఆంక్షలను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.