అదో బ్రాండెడ్ పార్టీ..! మహారాజకీయాల్లో మహాప్రస్థానమున్న మహాపార్టీ..! అయితే ఇదంతా గతం..! ఇప్పుడా పార్టీ గతి అదో గతి..! ఎటు పోతుందో తెలియని భీతి...! ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలకు, గ్రూపులకు వెన్నులో వణుకు పుట్టించిన శివసేన.. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో పరువు పొగొట్టుకుంటోంది..! మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సగటు శివసేన పార్టీ కార్యకర్తను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం మధ్య జరుగుతున్న ఇంటర్నల్ ఫైట్.. ఆ పార్టీ పరువును ఎప్పుడో ముంబై బీచ్‌లో కలిపేసింది. పార్టీ గుర్తు కోసం ఈ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న రచ్చ.. ఈసీ, సుప్రీంకోర్టులో నలుగుతోంది. దీనిపై ఈ నెల 30న ఈసీ, ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు విచారించనుండగా.. ఈ వివాదంపై న్యూస్-18 లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ న్యాయ నిపుణుడు, న్యాయవాది ఉజ్వల్ నికమ్‌తో న్యూస్-18 ఈ వివాదంపై చర్చించింది. ఇంతకి శివసేన పార్టీ గుర్తు విల్లు, బాణం ఎవరిది? రియల్‌దా, రెబల్‌దా? ఉజ్వాల్ నికమ్ ఏమంటున్నారు..?
రాజకీయాల్లో ఫిరాయింపులు అసలు కొత్తే కాదు. శివసేన చీలకకు ముందు..శివసేన చీలకకు తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చాలా చూశాం..! అయితే మిగిలిన పార్టీ నేతల ఫిరాయింపులకు, శివసేన ఫిరాయింపులకు తేడా ఏంటి..?
అవును..భారత రాజకీయాల్లో ఫిరాయింపులు సాధారణమే. 1987-88 సమయంలో కూడా తమిళనాడులో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మరణానంతరం జరిగిన పరిణామాలు కూడా ఇలాంటివే. అప్పుడు జయలలిత, ఎంజీఆర్ భార్య జానకి మధ్య అంతర్గత పోరు జరిగింది. పార్టీకి ఎవరు అధ్యక్షత వహించాలనే విషయంలో వాగ్వాదం జరిగింది. జయలలితకు ప్రజాప్రతినిధుల మద్దతు లభించగా.. జానకికి పార్టీ బెస్‌పై పూర్తి పట్టు ఉంది. అయితే ఈ విషయంపై ఈసీ ఏం తేల్చకముందే జయలలిత, జానకి ఇద్దరూ రాజీకి వచ్చారు.
ఇప్పుడు మహారాష్ట్రలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం తామే పార్టీకి నాయకత్వం వహిస్తున్నామని.. ఎన్నికల గుర్తు తమకే దక్కాలని వాదిస్తోంది. మరోవైపు షిండే టీమ్ తమదే అసలైన శివసేన అని కౌంటర్ ఇస్తోంది. 55మంది శివసేన ఎమ్మెల్యేలలో మెజారిటీ 39 మంది తమతోనే ఉన్నారని గుర్తుచేస్తోంది.
రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా కంట్రోల్ చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కదా.? అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారు. అది షిండేకు పార్టీపై ఉన్న బలమే కదా?
ఇది బలాలకు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్న కాదు. క్లియర్‌కట్‌గా షిండేకు మెజారిటీ ఉంది. కానీ అదే సమయంలో, ఉద్ధవ్‌కు పార్టీ బెస్‌పై పూర్తిగా పట్టు ఉంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు పార్లమెంటు ద్వారా ఎప్పటికప్పుడు సవరణలు జరిగాయని మరవద్దు.ఇక మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. అటు పదో షెడ్యూల్ ప్రకారం రెండు పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వాన్ని నేతలు కోల్పోవచ్చు. అందులో ఒకటి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం.రెండోది, సంబంధిత ప్రజాప్రతినిధి పార్టీ విప్‌ను ధిక్కరిస్తే, ఆ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు షిండే టీమ్‌పై ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తున్నది సరిగ్గా ఇలాంటిదే..! పార్టీ విప్‌ను షిండే, అతని ఎమ్మెల్యేలు పాటించలేదన్నది ఉద్ధవ్ టీమ్ ప్రధాన ఆరోపణ.
ఉద్ధవ్, షిండే పంచాయితీలో ఈసీ ఎవరి వాదనకు ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది..? మొత్తం పార్టీ తన వద్ద ఉందని ఉద్ధవ్ చెబుతుండగా.. మెజారిటీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని షిండే వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేనికి ఎక్కువ ప్రధాన్యమిస్తారు?
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ వివాదాన్ని నిర్ణయించడానికి ఈసీ ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యతనిస్తుంది. 2016-17లో ఇలాంటి సీనే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ జరిగింది. ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ మధ్య పార్టీ గుర్తు విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి.సైకిల్ గుర్తును అఖిలేశ్‌కు ఇవ్వకూడదని ములాయం సింగ్ యాదవ్ ఈసీ తలుపు తట్టారు. తానే పార్టీ వ్యవస్థాపకుడిని.. తన చేతిలోనే పార్టీ ఉందని వాదించారు. అయితే ఎమ్మెల్యేల బలమున్న అఖిలేశ్ వైపే ఈసీ మొగ్గుచూపింది.
గతేడాది అంధేరి ఈస్ట్ బైపోల్ సమయంలో శివసేన గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. అయితే పార్టీ గుర్తును శాశ్వతంగా ఫ్రీజ్ చేసే అవకాశముందా?
శాశ్వతంగా పార్టీ గుర్తును ఫ్రీజ్ చేసే అవకాశాలు లేవని చెప్పలేను. 1969లో కాంగ్రెస్ వర్సెస్ ఇందిరాగాంధీ అంతర్గత పోరులో పార్టీ గుర్తును ఈసీ ఫ్రీజ్ చేసింది. రెండు గ్రూపులకు వేర్వేరు గుర్తులు ఇచ్చింది ఇవ్వబడ్డాయి. ఇప్పుడు జరుగుతున్న షిండే వర్సెస్ ఉద్ధవ్ కేసు కూడా దాదాపు అలాంటిదే. వాదనలు, ప్రతివాదనలతో ఏం డెసిషన్ తీసుకోవాలో ఈసీ నిర్ణయించుకోలేకపోతే పార్టీ గుర్తును శాశ్వతంగా ఫ్రీజ్ చేసే అవకాశాలున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eknath Shinde, Maharashtra, Shiv Sena, Uddhav Thackeray