షిరిడీలో నిరవధిక బంద్... ఆలయ పూజలు కంటిన్యూ...

Maharashtra : షిరిడీ సాయిబాబా ఆలయాన్ని ఇవాళ్టి నుంచీ మూసివేస్తారని ప్రకటన వచ్చినా... తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. అందువల్ల ఆలయ మూసివేత లేదు. నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నాయి.

news18-telugu
Updated: January 19, 2020, 5:51 AM IST
షిరిడీలో నిరవధిక బంద్... ఆలయ పూజలు కంటిన్యూ...
షిరిడీలో నిరవధిక బంద్... ఆలయ పూజలు కంటిన్యూ...
  • Share this:
షిరిడీలోని సాయిబాబా మందిరంలో ఎప్పటిలాగే ఆదివారం కూడా పూజలు, భక్తుల దర్శనాలూ కొనసాగుతాయని ఆలయ ట్రస్టు మళ్లీ మళ్లీ ప్రకటించింది. ఇలా ఎందుకు చెప్పిందంటే... షిరిడీ గ్రామస్థులు, స్థానికులు ఇవాళ్టి నుంచి నిరవధిక బంద్ తలపెట్టారు. ఆదివారం నుంచీ ఆలయం కూడా మూసివేస్తామని హడావుడిగా ప్రకటించారు. షాకైన ఆలయ ట్రస్ట్... వెంటనే ప్రకటన చేసింది. ఆలయ మూసివేత ఉండదనీ, భక్తులు ఆందోళన చెందవద్దనీ తెలిపింది. ఆ తర్వాత స్థానికులతో చర్చించి వాళ్లను కూడా ఒప్పించింది. సో... ఆలయం తెరచివుంటుంది కానీ... స్థానికులు మాత్రం రకరకాలుగా తమ నిరసన తెలుపుతారు. ఇవాళ్టి నుంచి బంద్‌ అమల్లో ఉంటుంది. ఆలయ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూసి ఉంటాయి. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని షిరిడీ ట్రస్ట్ తెలిపింది. ఏదైనా ఈ టైమ్‌లో షిరిడీకి వెళ్లే వాళ్లకు ఇబ్బందులు తప్పవని అనుకోవచ్చు. ఎందుకంటే... ఆలయం తప్ప అన్నీ మూసి ఉంటే... ఇంకేం చెయ్యగలం?

దీనంతటికీ కారణం ఇటీవల శివసేన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. కొత్తగా అధికారంలోకి వచ్చిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం... బీజేపీకి షాక్ ఇస్తూ... ఓ నిర్ణయం తీసుకుంది. ఏంటంటే... సాయిబాబా జన్మస్థలమైన పత్రిలో భక్తుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయిస్తాం అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. ఆయన అలా ప్రకటించారో లేదో... ఇలా షిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి. ఎందుకంటే... షిరిడీయే సాయిబాబా జన్మస్థలం అని అక్కడి స్థానికులు... కాదు పత్రియే సాయి జన్మస్థలం అని అక్కడి వాళ్లూ అంటున్నారు. ఇప్పుడీ కొత్త ప్రభుత్వం పత్రిని అభివృద్ధి చేస్తే... భక్తులంతా షిరిడీకి రాకుండా పత్రికి వెళ్లిపోతారనీ... తద్వారా తమకు అన్యాయం జరుగుతుందని షిరిడీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే... ఏపీలో రాజధాని తరలింపు వివాదం ఎలా ఉందో... అదీ అలాగే ఉంది.

ఇప్పుడు షిర్డీలో స్థానికుల వాదన ఏంటంటే... ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే... సాయిబాబా జన్మస్థలం పత్రి అన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అప్పటివరకూ తమ ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు. కానీ ఉద్ధవ్ థాక్రే తీరు చూస్తే... వెనక్కి తీసుకోవడం సంగతేమోగానీ... మరింత ఎక్కువగా పత్రికి అనుకూల నిర్ణయాలు తీసుకునే టైపు. ఎందుకంటే... ఈ నిర్ణయం బీజేపీకి ఏమాత్రం నచ్చనిది. ప్రస్తుతం బీజేపీతో కత్తులు దూస్తున్న ఉద్ధవ్... కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఆల్రెడీ ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు