అయోధ్య రామ మందిరంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..

పవార్ వ్యాఖ్యలు ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని.. రాముడికి వ్యతిరేకమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతి మండిపడ్డారు.

news18-telugu
Updated: July 20, 2020, 4:54 PM IST
అయోధ్య రామ మందిరంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అయోధ్యంలో రామాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాలయం కట్టడం వల్ల కరోనా వైరస్ తగ్గుతుందని కొందరు భావిస్తున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. హిందువుల మనోభావాలను కించపరిచారని విరుచుకుపడుతున్నారు. పవార్ వ్యాఖ్యలు ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని.. రాముడికి వ్యతిరేకమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతి మండిపడ్డారు.

ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఏనాడూ సెలవు తీసుకోలేదు. రోజులో నాలుగు గంటలు మాత్రమే ఆయన నిద్రిస్తారు. పవార్ ప్రకటన రాముడికి వ్యతిరేకంగా చేసినదే కానీ మోదీకి వ్యతిరేకంగా కాదు.
ఉమా భారతి



కరోనా మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలని మనందరం ఆలోచిస్తున్నాం. కానీ కొందరు మాత్రం రామాలయం కడితే కరోనా పోతుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది. ఆర్ధిక వ్యవస్థను మళ్లీ ఎలా గాడిన పెట్టాలన్నదే మన ప్రాధాన్యత. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
శరద్ పవార్


అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీకి శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాలు పంపింది. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు తెలుస్తోంది. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

కాగా, అయోధ్యలో బాబ్రీ మసీదు, రామజన్మ భూమి వివాదంపై గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదస్పద స్థలం రామ్‌ లల్లాకే చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అటు అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని తీర్పులో పేర్కొంది. తీర్పు వచ్చిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం ప్రభుత్వం.. మహంతి నిత్య గోపాల్ దాస్ అధ్యక్షతన 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ బాధ్యతలను ఆ ట్రస్టే చూస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 20, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading