కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మంత్రి -ఎన్నికల వేళ Uttarakhandలో కమలానికి దెబ్బ

కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మంత్రి

Uttarakhand BJP Minister Joins Congress : ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి షాకిస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కాంగ్రెస్ లోకి జంపయ్యారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కొడుకు కూడా బీజేపీని వీడారు. వీళ్లద్దరూ ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. సిట్టింగ్ మంత్రి చేరికతో కాంగ్రెస్ బలం పెరిగిందని, దేవభూమిలో బీజేపీ ఓటమి ఖాయమని నేతలు అంటున్నారు..

  • Share this:
దేవభూమిగా పేరుపొందిన ఉత్తరాఖండ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, కప్పగంతులు పెరిగాయి. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రి యష్‌పాల్ ఆర్యా బీజేపీని వీడారు. మంత్రి యష్‌పాల్ ఆర్యాతోపాటు ఆయన కొడుకు సంజీవ్ ఆర్యా(నైనిటాల్ ఎమ్మెల్యే) కూడా కాంగ్రెస్ లో చేరారు.

ఉత్తరాఖండ్ లో బీజేపీ ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన తర్వాత పార్టీలో లుకలుకలు పెరిగాయి. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామితో మంత్రులకు పడటంలేదు. కొందరు విమర్శలతో కాలం నెట్టుకొస్తుండగా, యష్‌పాల్ ఆర్యా మాత్రం ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రత్యక్షమైన యష్‌పాల్ ఆర్యా, ఆయన కొడుకు సంజీవ్ ఆర్యా.. రాహుల్ గాంధీని కలుసుకున్నారు. అనంతరం..

ఏఐసీసీ కార్యాలయంలో రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తో కలిసి ఆర్యా ఆయన కొడుకు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నానన్న యష్‌పాల్ ఆర్యా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారని, దానిని సీఎం వెంటనే ఆమోదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. కాగా, యష్‌పాల్ ఆర్యా రాక ఘర్ వాపసీ లాంటిదని కాంగ్రెస్ భావిస్తున్నది.

యష్‌పాల్ ఆర్యా రాజకీయ జీవితం చాలా వరకు కాంగ్రెస్ తోనే కొనసాగింది. 2002 నుంచి 2007 వకు ఆయన అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2007 నుంచి 2014దాకా ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. మోదీ హవాలో కాంగ్రెస్ బలహీనపడటంతో బీజేపీలో చేరిన ఆర్యా.. మళ్లీ ఇన్నేళ్లకు సొంత గూటికి చేరారు.
Published by:Madhu Kota
First published: